7 June, 2026 | 1:22 AM

‘సెమీ కండక్టర్’లకు అనుకూలం

07-06-2026 12:00 AM
  1. తెలంగాణలో అపారమైన వనరులు
  2. పెట్టుబడులకు మలేషియా కంపెనీలను ప్రోత్సహించండి
  3. సవాళ్లను ఎదుర్కొనేలా ‘ఎకో సిస్టం’ అభివృద్ధి 
  4. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు
  5. మలేషియా ప్రతినిధుల బృందంతో భేటీ 

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి) : సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రో త్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందా న్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా అంతర్జాతీయస్థాయి సదుపాయాలతో కూడిన సెమీ కండక్టర్ ‘ఎకో సిస్టం’ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మలేషియా పెనాంగ్ డిప్యూటీ సీఎం వైబీ జగదీప్‌సింగ్ దియో నేతృత్వంలో ఆ దేశ అత్యున్నతస్థాయి ప్రతినిధుల బృందం శనివారం తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును కలిసింది.

తెలంగాణ-, మలేషియా(పెనాంగ్) మధ్య సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ, ఏఐ, ఇన్నోవేషన్, హ్యూమన్ క్యాపిటల్ డెవలెప్‌మెంట్ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి గల అవకాశాలపై చర్చించారు. చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ, అడ్వాన్స్‌డ్ మ్యాన్ ఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుం టున్న చర్యలను మంత్రి వివరించారు.

తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేం దుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యా కేజింగ్ రంగాల్లో పెనాంగ్‌కు ఉన్న అనుభవం.. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తెలం గాణ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘తెలంగాణ లాం టి ప్రగతిశీల రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఇరు ప్రాంతాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళ్తాం’ అని వైబీ జగదీప్ సింగ్ దియో పేర్కొన్నారు.