23-02-2026 02:30:47 AM
ఇరవయ్యో శతాబ్దం చివరి దశలో ప్రారంభమైన డిజిటల్ విప్ల వం ప్రపంచ సాహి త్య రంగానికే కాకుం డా తెలుగు సాహిత్యానికీ కొత్త దిశను చూ పించింది. ముద్రిత పత్రికల పరిమితులను దాటి, అంత ర్జాల వేదికలు రచయితలకు విశాలమైన ప్రపంచాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యం డిజిటల్ మాధ్యమంలో విస్తరించి, పాఠకులకు తక్షణ స్పందనతో కూడిన కొత్త అనుభూతిని అం దిస్తోంది. తెలుగుసాహిత్య రంగంలో మహిళల కోసం ప్రగతిశీల భావజాలంతో మొదట 1991లో ‘మాతృక’ అంతర్జాల పత్రిక ప్రారంభమైంది.
మహిళా సమస్యలపై చైతన్యం పెంపొందించడంలో వెబ్‌సైట్ విశేషమైన పాత్ర పోషించింది. కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయినా 2015 ఫిబ్రవరి 15న మళ్లీ పునఃప్రారంభమైంది. అలాగే 1993 జనవరిలో ‘భూమిక’ అచ్చు పత్రికగా మొదలైంది. కొండవీటి సత్యవతి సంపాదకత్వంలో నడుస్తున్న ఈ పత్రిక 2006 నవంబర్ నుంచి అంతర్జాలంలోకి ప్రవేశించింది.
దక్షిణ భారతదేశంలోనే సంపూర్ణ స్త్రీవాద దృక్పథంతో నడిచిన తొలి అంతర్జాల పత్రికగా ఈ వెబ్‌సైట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలుగు అంతర్జాల పత్రికా రంగంలో 1998 సంవత్సరం ఒక మైలురాయి. అదే ఏడాది దీపావళి సందర్భంగా ‘ఈమాట’ (eemaata. com) ప్రారంభమైంది. యూనీకోడ్ రాకముం దు నుంచి కొనసాగుతున్న పురాతన డిజిటల్ పత్రికగా దీనికి గుర్తింపు ఉంది.
కొలిచాల సురేష్ నిర్వాహకునిగా ఉన్న ఈ పత్రిక లాభాపేక్ష లేకుండా నడుస్తోంది. ప్రవాస ఆంధ్రులను సాహిత్యంతో అనుసంధానించడమే దీని ప్రధాన లక్ష్యం. తొలుత ద్వైమాసిక పత్రికగా వెలువడి 2017 నుంచి మాసపత్రికగా మారింది. ఈమాట గ్రంథాలయం ద్వారా పుస్తకాలను డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించడం ఒక వినూత్న ప్రయోగం. అదే ఏడాది డిసెంబర్లో సిడ్నీ నుంచి ‘ఈతెలుగు’ పత్రిక వెలువడింది. ప్రొఫెసర్ బీభాస్కరరావు సంపాదకత్వంలో పాత, కొత్త తరాల రచయితల రచనలను ఇది సమన్వయం చేసింది.
పరిశోధన , సాంకేతికత - కొత్త పుంతలు
2003వ సంవత్సరంలో ‘భావ వీణ’ అనే మాసపత్రిక కోళ్ల శ్రీకృష్ణారావు సంపాదకత్వంలో ప్రారంభమైంది. కళలు, సంస్కృతి, భాషాధ్యయనం వంటి అంశాలకు ఇది పెద్దపీట వేసింది. తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు దీనిని పరిశోధన పత్రికగా గుర్తించడం విశేషం. 2004 జనవరి నుంచి ‘సుజన రంజని’ పత్రిక కాలిఫోర్నియా ప్రవాసాంధ్రుల ద్వారా నిరంతరంగా వస్తోంది. వీరు పత్రిక కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించుకున్నారు. ఇది యూనీకోడ్తో పాటు పీడీఎఫ్ రూపంలో కూడా లభిస్తోంది.
సాంకేతిక హంగులతో పాఠకులను ఆకట్టుకోవడంలో ఈ పత్రిక తనదైన ముద్ర వేసింది. 2005 సెప్టెంబర్ 13న ‘కదంబం’ పత్రిక ప్రారంభమై సాహితీ వార్తలకు ప్రాధాన్యమిచ్చింది. పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాల సమాచారాన్ని ఇది పాఠకులకు చేరవేస్తోంది. అదే ఏడాది ఉగాది రోజున లండన్ తెలుగు సంఘం ‘మా తెలుగు’ పత్రికను ప్రారంభించింది.
యేటా ఉగాది ప్రత్యేక సంచికలను తీసుకురావడం వెబ్‌సైట్ ప్రత్యేకత. 2006 అక్టోబర్‌లో ‘ప్రజాకళ’ పత్రిక అడుగుపెట్టింది. ప్రజాస్వామిక, ప్రగతిశీల భావజాలంతో సామాజిక స్పృహ కలిగిన రచనలకు ఇది వేదికగా నిలిచింది. హిమబిందు, చైతన్య సాజీ వంటి వారు దీనిని సమర్థంగా నిర్వహిస్తున్నారు. పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉండడం వల్ల ఈ పత్రిక విస్తృత పాఠక వర్గానికి చేరువైంది.
విస్తరణ దశలో విప్లవాత్మక మార్పులు
2007 జూలై నుంచి ‘ప్రాణహిత’ పత్రిక తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 2008లో అనంతపురం జిల్లా కొత్తపల్లి నుంచి ‘కొత్తపల్లి’ అనే పత్రిక పిల్లల కోసం ప్రత్యేకంగా ఆవిర్భవించింది. 2009లో ‘పుస్తకం. నెట్’, ‘జాబిల్లి’ వంటి పత్రికలు విభిన్న శైలులతో పాఠకులను ఆకట్టుకున్నాయి.
ఈ కాలంలోనే యూనికోడ్ వాడకం పెరిగి తెలుగు అక్షరాలను వెతకడం సులభమైంది. 2010 నుంచి 2015 మధ్య కాలంలో ఆన్‌లైన్ పత్రికలు గుణాత్మక మార్పులను సంతరించుకున్నాయి. 2010 నవంబర్లో ‘హంసిని’, ‘అరవై నాలుగు కళలు’ వంటి పత్రికలు వచ్చాయి. 2011 నవంబర్ 11న ‘విహంగ’ తొలి తెలుగు మహిళా వెబ్ పత్రికగా చారిత్రక రికార్డు సృష్టించింది. 2012లో ‘స్వర్ణపుష్పం’ మాసపత్రిక ఐఎస్‌ఎస్‌ఎన్ గుర్తింపుతో పరిశోధనలకు ఆయువుపట్టుగా మారింది. 2013 ఏప్రిల్ నుంచి ‘నెచ్చెలి’, ‘అక్షర దీపిక’ వంటి పత్రికలు ప్రవాసాంధ్రుల సాహిత్య ఆకలిని తీర్చాయి.
2016 నుంచి నేటి వరకు ఆన్లైన్ పత్రికల స్వరూపం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో పాఠకులు ఎక్కడైనా ఎప్పుడైనా చదివే సౌలభ్యాన్ని పొందారు. 2020లో ప్రారంభమైన ‘సహరి’ డిజిటల్ మ్యాగజైన్ వీక్లీ, మంత్లీ సంచికలతో సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. 2021లో ‘తపస్వీ మనోహరం’ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. 2024లో ’సాహిత్య తరంగిణి’ అంతర్జాతీయ పీర్ రివ్యూడ్ జర్నల్ గా అకడమిక్ రంగంలో వేగంగా ఎదుగుతోంది. పత్రికా ప్రపంచంలో ముద్రణ నుంచి డిజిటల్ వైపు జరుగుతున్న మార్పు అనివార్యంగా మారింది. కాలక్రమేణా పాఠకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి.
ప్రారంభంలో కేవలం సమాచారం కోసం పత్రికలను ఆశ్రయించిన వారు ఇప్పుడు లోతైన విశ్లేషణలను కోరుకుంటున్నారు. అంతర్జాల లభ్యత పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహితీపరులు తక్షణమే స్పందించే అవకాశం కలిగింది. సాహిత్య చర్చలు, సమీక్షాత్మక వ్యాసాలు డిజిటల్ మాధ్యమాల్లో కొత్త ఊపిరి పోసుకుంటున్నాయి. కేవలం పఠనానికే పరిమితం కాకుండా సామాజిక జోక్యం చేసుకునే స్థా యికి ఈ పత్రికలు ఎదిగాయి. భవిష్యత్తులో కృత్రిమ మేధ, ఆడియో పత్రికల వంటి సాంకేతికతలు తెలుగు సాహిత్య పత్రి కా రంగాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయనే అంచనా సాహిత్యరంగ పరిశోధకుల నుంచి వ్యక్తమవుతున్నది.
డాక్టర్ ఐ.చిదానందం
88014 44335