29 May, 2026 | 3:56 AM

కాంట్రాక్టర్ చేతివాటం! అధికారుల లాలూ'చీ'

29-05-2026 01:43 AM

నిర్మాణం పూర్తికాకముందే పగుళ్లు.. కృంగిపోయిన మెట్లు..!

కోట్ల భవనం కుప్పకూలే ప్రమాదంలోనా?

కొండపాక, మే 28: కొండపాక మండలం రాంపల్లి గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్ పార్క్ ఫారెస్ట్ భవనం అధికారుల కలుచితో కాంట్రాక్టర్ చేతివాటానికి అవకాశంగా మారింది. అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం నిదర్శనంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మిస్తున్న ఈ భవనం పనులు 2023 నుంచి నత్తనడకన సాగుతుండగా, నిర్మాణం పూర్తికాకముందే గోడలు, స్లాబ్లలో పగుళ్లు కనిపించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.

ఫారెస్ట్ శాఖ హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాస్కు పనులు అప్పగించినప్పటికీ, పనుల పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పక్కన పెట్టి, నాసిరకం ఇసుక, సిమెంట్, కంకర వినియోగించడంతో పాటు తక్కువ స్థాయి స్టీల్ వాడటమే ఈ దుస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అసంపూర్తిగా ఉన్న భవనంలోనే స్లాబ్లు పగిలిపోవడం, గోడలకు చీలికలు రావడం, ముఖ్యంగా మెట్లు పూర్తిగా కృంగిపోవడం నిర్మాణ నాణ్యత ఎంత దారుణంగా ఉందో అద్దం పడుతోంది. పిల్లర్లు, బీమ్ల నిర్మాణంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా కొనసాగుతున్న ప నుల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాడన్న ఆరోపణలు బలపడుతున్నాయి.

భవనం పూర్తికాకముందే రిపేర్ల పరిస్థితి వస్తే పూర్తయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో? అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తూ, నాణ్యతను మాత్రం బలి చేస్తున్నారని మండిపడుతున్నారు. భవనం పూర్తి కాకముందే అసంపూర్తి భవనానికి సున్నం వేసి నిధులు విడుదల చేసుకున్నారని సంబంధిత శాఖ అధికారులే ముక్కున వేలేసుకున్నారు. 

అధికారుల మామూళ్ల మత్తు.. 

డీఎఫ్‌ఓ వివరణ కోరగా మెట్లు కృంగిపోయినందుకు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించలేదనీ, ఆ మెట్లను పూర్తిగా తొలగించి మళ్లీ నాణ్యతతో నిర్మించాలని ఆదేశించమని ఆమె తెలిపారు. అయితే స్థానికులు మాత్రం అధికారులు మామూళ్ల మత్తుకు లోనై  మెట్లు కృంగిన తర్వాత చర్యలు తీసుకోవడం నిదర్శనమని మండిపడుతున్నారు. మొదటి నుంచే పర్యవేక్షణ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు అంటూ అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.