27 July, 2026 | 4:30 PM

ఐటీ సంస్థలకు వర్ష హెచ్చరిక

27-07-2026 03:37 PM

హైదరాబాద్: నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Rain warning) కురిసే అవకాశం ఉన్నందున, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను దశలవారీగా ముందుగానే లాగ్ అవుట్ చేయాలని సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) సోమవారం హెచ్చరిక జారీ చేశారు. ఈ చర్య ప్రయాణ సంబంధిత ప్రమాదాలను తగ్గించి, రహదారి మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని తగ్గిస్తుందని, అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నిత్యావసర సేవలు సజావుగా సాగేందుకు తోడ్పడుతుందని పోలీసులు తెలిపారు.

భద్రత, ఉత్పాదకత, తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచన జారీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐటీ కంపెనీలు, సంస్థలు ఉద్యోగులకు ముందే లాగౌట్ ఇవ్వాలని కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా సంస్థలు సహకరించాలని పోలీసులు సూచించారు. లోకేషన్, లాగౌట్ సమయాలను పోలీసులకు తెలియజేయాలని కోరారు.

తెలంగాణకు ఐఎండీ వర్ష హెచ్చరిక

బంగాళాఖాతంలో  అల్పపీడనం కారణంగా తెలంగాణలో రానున్న 4–5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటిలో మునిగే పరిస్థితులు, రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ తెలిపింది. ఆదివారం రాత్రి తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. ఇందులో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో అత్యధికంగా 76.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 51.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో కంది (42.5 మి.మీ), కద్పాల్ (41.3 మి.మీ) నిలిచాయి. వాతావరణ శాఖ ప్రకారం, సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.