శ్రీరామాలయంలో కలెక్టర్ దంపతులు
హనుమకొండ, మార్చి 2౭ (విజయక్రాంతి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండలో భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఎన్పిడీసీఎల్ సిఎండీ వరుణ్ రెడ్డి దంపతులు రెవెన్యూ కాలనీలోని శ్రీరామాలయాన్ని సందర్శించారు. ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేదమంత్రాల నడుమ నిర్వహించిన ఈ పూజల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు, ప్రజల సంక్షేమం, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీరామనవమి పండుగ మనకు ధర్మం, న్యాయం, సత్యనిష్ఠ వంటి విలువలను గుర్తుచేస్తుందని అన్నారు. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.స్వచ్ఛత, భద్రత, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించారు.




