17 May, 2026 | 2:38 AM

చాయ్‌వాలా.. ఈ కార్పొరేటర్

17-05-2026 12:00 AM

కరీంనగర్‌కు చెందిన పొన్నం లక్ష్మి నిరుపేద కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితు కారణంగా చదువుకు మధ్యలోనే స్వస్తి పలికారు. జీవనోపాధి కోసం చిన్న వయసులోనే వివిధ పనులు చేయాల్సి వచ్చింది. వివాహం తర్వాత కూడా కుటుంబ పరిస్థితులు మెరుగుపడకపోవడంతో భర్త మొండయ్యతో కలిసి కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో చిన్న టీ స్టాల్  ప్రారంభించింది. కొడుకు సంజిత్ కూడా తల్లిదండ్రులకు తోడుగా నిలబడ్డాడు. ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు టీ అమ్ముతూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు.  

ప్రజలతో సత్సంబంధాలే టర్నింగ్ పాయింట్

ఆమె జీవితాన్ని మార్చింది ప్రజలతో ఏర్పడిన అనుబంధమే. టీ తాగడానికి వచ్చే స్థానికులు తమ సమస్యలు చెప్పుకుంటే, వాటిని పరిష్కరించేందుకు లక్ష్మి, ఆమె భర్త ప్రయత్నించేవారు. తాగునీరు, రోడ్ల సమస్యలు, పారిశుద్ధ్యం, మహిళల భద్రత వంటి అంశాలపై అధికారులను సంప్రదిస్తూ ప్రజల తరఫున నిలబడేవారు. కరోనా సమయం లోనూ ఆమె అందించిన సేవలు ప్రజలకు మరింత చేరువ చేశారు. కరోనా బాధితులకు ఉచితంగా టీ, అల్పాహారం అందించారు.  ఆ విధంగా ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న లక్ష్మిని ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. మొదట వెనుకడుగు వేసినా, ప్రజలకు ఇంకా సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 43వ డివిజన్ నుంచి బీజేపీ తరఫున కార్పొరేట్‌గా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు.  

ఆమె ఒక సాధారణ మహిళ.. 

కుటుంబ పోషణ కోసం భర్తతో కలిసి 

చిన్న టీ స్టాల్ ప్రారంభించింది. 

చాయ్‌లు అమ్ముకుంటూ ప్రజలకు చేరువైన ఆమె.. వారు చెప్పే సమస్యలు వినేది. వాటి పరిష్కారానికి ప్రయత్నించేది. కరోనా సమయంలోనూ ఆమె అందించిన సేవలు జన హృదయాలను గెలుచుకొని కార్పొరేటర్ స్థాయికి చేర్చాయి. సామాన్య టీ విక్రేతగా జీవితాన్ని ప్రారంభించి, పైసా ఖర్చు చేయకుండా ప్రజల ఆదరణతో కార్పొరేటర్ పదవిని అలంకరించిన పొన్నం లక్ష్మిజీవితం స్ఫూర్తిదాయకం.  

మోదీతో ప్రశంసలు: ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి  కేంద్ర మంత్రి బండి సంజయ్ లక్ష్మిని పరిచయం చేయించారు. లక్ష్మి సాధారణ గృహిణి అని, టీ స్టాల్ నడుపుకుంటూ ప్రజా సేవలోకి వచ్చిన తీరు,  కార్పొరేటర్‌గా ఎన్నికైన విషయాన్ని ప్రధానికి వివరించారు. ఆమె పోరాటాన్ని ప్రధాని ప్రశంసించారు. సాధారణ మహిళలు నాయకత్వం వహించడం దేశ ప్రజాస్వామ్యానికి బలం అని అభినందించారు. మోదీ ప్రశంసలతో నా జీవితం ధన్యమైనదంటూ లక్ష్మి చెప్పారు.  

ఎన్ని కష్టాలొచ్చినా వెనుకడుగు వేయలేదు

నేను సాధారణ మహిళను. ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గలేదు. చిన్న టీ స్టాల్ నుంచి ప్రారంభమైన నా జీవితం, ప్రజల ప్రేమతో కార్పొరేటర్ స్థాయికి ఎదిగేలా చేశాయి. పైసా ఖర్చు చేయకుండా ప్రజల ఆదరణతో ఎన్నికల్లో గెలిచాను. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు మంచి వేదిక. మహిళలు ధైర్యంగా ముందుకు వస్తే ఏరంగంలోనైనా విజయం సాధించగలరు. సంకల్పం, సేవాభావంతో ఉంటే సామాన్య మహిళ కూడా సమాజంలో గొప్ప మార్పు తీసుకురావచ్చు. భర్త పొన్నం మొందయ్య నాకు స్ఫూర్తి.

 పొన్నం లక్ష్మి, బీజేపీ కార్పొరేటర్, కరీంగనర్