17 May, 2026 | 1:20 AM

చరిత్రకు సాక్ష్యం సూర్యాపేట!

17-05-2026 12:00 AM

* తెలంగాణ- రాజధాని హైదరాబాద్‌కు దాదాపు 140 కిలో మీటర్ల దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో అనేక చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. పురాతన కట్టడాలు, ఎతైన కొండలు, దట్టమైన అడవులు, ప్రాచీన శిలాయుగం నాటి రాక్షసగుళ్లు, క్రీస్తు పూర్వం నాటి భౌద్ధస్తూపాలు, కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధి శివాలయాలు, మూసి రిజర్వయర్, కృష్ణా, గోదావరి నదుల నీటి ప్రవాహాలతో మిళితమై ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయంగా సూర్యాపేట జిల్లా నిలుస్తున్నది. 

పిల్లలమర్రి గ్రామం జిల్లా కేంద్రానికి 3 కిలో మీటర్ల దూరంలో 65 నెంబర్ జాతీయ రహదారికి 1 కిలో మీటరు దూరంలో ఉన్నది. కాకతీయుల కాలంనాటి శివాలయాలు వారి కళా సృష్టికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నా యి. క్రీ.శ 1203లో కాకతీయ సామంతరాజు అయిన రేచర్ల వంశానికి చెందిన బేతిరెడ్డి పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ నిర్మించిన ఎరుకేశ్వరాలయం, త్రికుటేశ్వరాలయం, నామేశ్వరాలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. సప్త స్వరాలను వినిపించే రాతిస్తంబం ఉన్నది. పిల్లలమర్రి పినవీరభద్రుడు జన్మించిన గ్రామం ఈ పిల్లలమర్రి.

బౌద్ధసిరి.. ఫణిగిరి

జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం లో జనగాం రహదారిపై ఉన్న ఫణిగిరి గ్రామం బౌద్ధసిరిగా, పర్యాటక ప్రదేశంగా వెలుగొంతున్నది. పని అనగా పాము, గిరి అంటే కొండ అని అర్థము. అయితే ఇక్కడ ఉన్న కొండ.. పాము పడగా ఆకృతిలో ఉండడం మూలంగానే ఈ గ్రామానికి పనిగిరి అనే పేరు వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ ఫణిగిరి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో క్రీ.పూ 13 శతాబ్దం నాటి బౌద్ధ మహాస్తూపం, మందమైన ఇటుకలతో నిర్మించిన చైత్యగదులు, విహారాలు, పాలరాతి శిల్పాలు, బౌద్ధ జాతక కథలతో చెక్కిన తోరణాలు, బ్రహ్మలిపిలో శిలాశాసనాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో రోమన్ రాజుల కాలంనాటి బంగారు, వెండి, గాజు, రాగి, నాణాలు లభ్యమయ్యాయి. 

ఉండ్రుగొండలో చారిత్రక కట్టడాలు

జిల్లా కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండ్రుగొండ చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. చుట్టు కొండలు, అల్లుకున్న చెట్ల మధ్య ఆధ్యాత్మికత ఉట్టిపడేలా లక్ష్మీ నర్సింహ్మస్వామి ఆలయం ఉండడం ప్రత్యేకత. ఉండ్రుగొండ ప్రాంతం 1370 ఎకరాల విస్తీర్ణంలో చెట్ల మధ్య 9 కొండలను కలుపుతూ 14 కిలో మీటర్ల పొడవున నిర్మించిన ఎత్తున దుర్గప్రాకారాలు, కొలనులు, కొండపైన గొలుసుకట్టు నీటి కుంటలు, గృహాలు ఆదార్మికతను వెల్లివిరిసే పురాతన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి.

శాతవాహనులు, కళ్యాణ చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, రేచర్లరెడ్డి రాజులు, పద్మనాయకులు ఈ కోటను అభివృధ్ధి చేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ గుట్టలపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గోపాలస్వామి, కాలభైరవుడు, రాజభవనాలు, నర్తకీమణుల గృహాలు, బోగందాని గద్దెమంటపం, చాకలిబావి, మంత్రిబావి, నాటి చారిత్రక వైభవానికి ప్రతీకలుగా ఉన్నాయి. కొండపై నుంచి నాగుల పహాడ్ శివాలయం వరకు సొరంగమార్గం ఉండేదని ఈ ప్రాంత ప్రజలు చెపుతారు. 

పేరుగాంచిన పెద్దగట్టు జాతర

తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క- సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్ద జాతర జిల్లాలోని పెద్దగట్టు (గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతర. సూర్యాపేటకు 7 కిలో మీటర్ల దూరంలో దురాజ్ పల్లి గ్రామంలో ఉన్నది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 

జాన్‌పహడ్ దర్గా 

కుల మతాలకు అతీతంగా దర్శించుకుంటూ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది జిల్లాలోని పాలకీడు మండలంలో గల జాన్ పహడ్ దర్గా. 4 శతాబ్దాల చరిత్ర గల ఈ దర్గాలో హజ్రత్ సయ్యద్ మోహినుద్దీన్ షా, జాన్ షాహిద్ అహ్మతుల్లా సమాధులు ఉన్నాయి. ఇక్కడ ఉర్సు సందర్భంగా పంచే గందానికి ప్రత్యేకత ఉంది.

ఇవే కాకుండా నాగులపహడ్ శివాలయం, మట్టంపల్లి లక్ష్మినర సింహస్వామి ఆలయం, సూర్యాపేట వెంకటేశ్వరస్వామి దేవాలయ, మిర్యాలలో సీతరామచంద్రస్వామి దేవస్థానం, అర్వపల్లిలో లక్ష్మినరసింహస్వామి ఆలయం, దర్గా, యర్రవరంలోని బాల ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం తదితర ప్రదేశాలు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. 

 నట్టె కోటేశ్వర్‌రావు 

(నల్లగొండ, విజయక్రాంతి)