20 May, 2026 | 6:05 AM

పకడ్బందీగా జనగణన సర్వే నిర్వహించాలి

20-05-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం, మే19(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండ లంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ పలు కార్యక్రమాలను ఆకస్మికంగా పరిశీలించారు. మల్లెలమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న సెన్సస్2027 జనగణన ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించిన అనంతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రం, సీతారాంపురంలోని శివసాయి రైస్ మిల్ను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణల్  శ్రేష్ఠ కూడా కలెక్టర్ వెంట పాల్గొన్నారు. మల్లెలమడుగు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లతో కలెక్టర్ మాట్లాడి, వివరాల నమోదు విధానం, డేటా సేకరణ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం దేశంలో జరుగుతున్న 16వ జనగణన ఇదేనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి జనగణన కావడం విశేషమన్నారు. ఈసారి తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. జనగణనలో మొత్తం 34 ప్రశ్నలు ఉంటాయని, ఒక్కో కుటుంబానికి సంబంధించిన వివరాలను సుమారు ఐదు నిమిషాల్లోనే నమోదు చేయవచ్చని కలెక్టర్ వివరించారు. 

అనంతరం మొండికుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలోని ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, రవాణా ఏర్పాట్లు, రైతులకు అందుతున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిన్నటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, ప్రస్తుతం ఉన్న నిల్వలు, రైతుల నుంచి ధాన్యం రాక పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలపై సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం కేంద్రంలో 5,550 ధాన్యం బ్యాగులు నిల్వలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. 

అనంతరం అశ్వాపురం మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఉన్న శివసాయి రైస్ మిల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులో ధాన్యం నిల్వలు, మిల్లింగ్ సామర్థ్యం, స్టాక్ వివరాలు, మిల్లింగ్ ప్రక్రియపై మిల్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రైస్ మిల్లులో సుమారు 6,000 క్వింటాళ్ల ధాన్యం నిల్వలో ఉన్నట్లు మిల్ సిబ్బంది వివరించింది.