23 April, 2026 | 2:51 AM

జనగణన జాగ్రత్తగా నిర్వహించాలి

23-04-2026 12:02 AM

చెన్నూర్, ఏప్రిల్ 22: జిల్లాలో మే 11 నుంచి నిర్వహించనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం చెన్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఇండ్ల గణనపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి మండల తహసిల్దార్ మల్లికార్జున్‌తో కలిసి హాజరై మాట్లాడారు.

ఇండ్ల గణన కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం చేపట్టాలని, జిల్లాలో గుర్తించబడిన ఇండ్ల జాబితా బ్లాక్ వివరాలను అందించడం జరుగుతుందని తెలిపారు. రోజురోజుకు ఉష్ణోగ్రత తీవ్రమవుతున్న దృష్ట్యా ఉదయం వేళలో ప్రక్రియ నిర్వహించేలా కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. తమ జాబితాలోని ఇండ్ల గణన కోసం ముందుగా ఆయా ఇండ్ల యజమానులకు సమాచారం అందించినట్లయితే సమయానికి అందుబాటులో ఉంటారని, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో ప్రక్రియ నిర్వహించాలన్నారు.

భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, ఎన్నికల నిర్వహణ జనగణనపై ఆధారపడి ఉంటుందని, ఈ నేపథ్యంలో ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అంతకుముందు మండలంలోని కిష్టంపేటలో గల డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. చెన్నూర్ పట్టణంలో చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎంపిఎస్‌ఓ ప్రవీణ్ కుమార్, ఫీల్ ట్రైనర్లు సురేందర్, గోపికృష్ణ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.