calender_icon.png 10 February, 2026 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ప్రచారం.. వలస ఓటర్లకు ఆహ్వానం

10-02-2026 01:41:54 AM

  1. ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చులు చూసుకుంటామని హామీ

అభ్యర్థుల్లో టెన్షన్...టెన్షన్

జోరుగా సాగనున్న ప్రలోభాలు

ఈనెల 11న పోలింగ్...13న ఫలితాలు

సంగారెడ్డి, ఫిబ్రవరి 9(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం తో ముగిసిపోయింది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించవద్దు. గత వారం రోజులుగా రాత్రి, పగలు తేడా లేకుం డా అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం సా గించారు. ప్రచారానికి బ్రేక్ పడడంతో ఇక ప్రలోభాలకు తెరలేపనున్నారు.

ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మందు, బిర్యాణి, నగదు పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు అభ్యర్థుల గెలుపుకోసం ప్రధాన పార్టీల మం త్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు తీవ్రస్థాయిలో ప్రచారాలు నిర్వహించారు. ఎలాగైనా చైర్మన్ పీఠాలను గెలుపొందాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. 

వలస ఓటర్లకు ఆహ్వానం...

మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. ఒక్క ఓటుతో ఐదేళ్ల పదవిని కోల్పోయన వారు ఎందరో. ఈ మేరకు బరిలో నిలిచిన అభ్యర్థులు అప్రమత్తమవుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక్కో ఇంటికి నాలుగైదు సార్లు వెళ్లి మరీ తమకు మద్దతు నివ్వాలని ఓటర్లను వేడుకున్నారు. ఓటు ఉండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నారు. తప్పకుండా పోలింగ్కు రావాలని కోరుతున్నారు.

ప్రయాణ, ఇతర ఖర్చు లు చూసుకుంటామని చెబుతున్నారు. అప్పటికప్పుడే ఫోన్ పే, గుగుల్ పేలో కొంత అ మౌంట్ పంపుతున్నారు. వచ్చాక మరి కొం త ఇస్తామని చెబుతున్నారు. తమకు అనుకూలంగా పడే పక్కా ఓట్లు ఎన్ని అనేదానిపై ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. కొంత కష్టపడితే వచ్చే ఓట్లేన్ని, తటస్తంగా ఉన్న ఓట్లను ఏ విధంగా రాబట్టుకోవాలనే దానిపై పార్టీ నేతలు, తమ ప్రధాన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు.

ఇందులో భా గంగానే వలస ఓటర్లపై దృష్టి సారించారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార ఇతరత్రా పనుల నిమిత్తం హైదరాబాద్, వరంగల్, బెంగుళూర్ వంటి నగరాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారిని రప్పించేలా చర్యలు చేపడుతున్నారు. వారి వివరాలు సేకరిస్తూ ఆ ఓట్లను రాబట్టుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

టికెట్టు ఖర్చులు భరిస్తూ...

వలస వెళ్లిన కాలనీవాసుల ఓట్లను సొం తం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్లు తీ వ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 11న పో లింగ్ ఉండగా ఆ రోజు తప్పకుండా రావాలని ఫోన్లు చేస్తూ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నారు. వారిని ఒప్పించి, రప్పించేలా చూడాల్సిన బాధ్యతను ప్రత్యేకంగా కొందరికి అప్పగించారు.

దీంతో వారు వలస ఓటర్లకు ఫోన్ చేసి రావాలని కోరుతున్నారు. ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చుల కింద కొంత మొత్తంను ఆన్లైన్ ద్వారా వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. కొంతమంది స్వయంగా ప్రయాణ టికెట్లను సైతం బుక్ చేస్తున్నారు.

 నలుగురు, ఐదుగురు ఓటర్లు ఒకేచోట ఉన్నట్లయితే వారి కోసం ప్రత్యేకంగా వాహనాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు.