22 July, 2026 | 3:25 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్

22-07-2026 02:19 PM

హైదరాబాద్: రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగా, గాంధీ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, పార్టీ నాయకులు తమ నాంపల్లి కార్యాలయం నుంచి బయలుదేరారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్. రామచందర్ రావు అరెస్టు చేసి గోషా మహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోదీ ఇంటి వద్ద రాహుల్ గాంధీ ధర్నాను వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ ప్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు చింపేశారు. అటు లోక్ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నివాసం వద్ద అరాచక మూకల్లా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ.. ఇక్కడ తెలంగాణలో తమ తప్పును ఎండగడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు N Ramchander Rao ను ఇతర బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్యఅని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఒకవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్యం ముసుగులో విధ్వంసాలు సృష్టిస్తూ, రాష్ట్రంలో మాత్రం పోలీసుల అండతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం కాంగ్రెస్ పార్టీ నియంతృత్వానికి, ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. పోలీసు నిర్బంధాలతో, అక్రమ అరెస్టులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను ఎవరూ భయపెట్టలేరన్న రామచందర్ రావు కాంగ్రెస్ అప్రజాస్వామిక, అరాచక విధానాలపై భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు!

"నిన్న లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రదర్శించిన రాజకీయ నాటకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గత కొన్ని వారాలుగా కనిపించకుండా ఉన్న రాహుల్ గాంధీ, అకస్మాత్తుగా కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాస గేట్ల ముందు ధర్నాకు దిగారు. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సభను ఎందుకు నడవనివ్వడం లేదు? పార్లమెంటరీ చర్చలో పాల్గొనడం బదులుగా, దేశంలో గందరగోళం, అరాచకం సృష్టించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వీధి నిరసనలు, ఉద్దేశపూర్వక అడ్డంకుల మార్గాన్ని ఎంచుకుంది. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు!" అని బీజేపీ చీఫ్ ఎక్స్ లో పోస్టు చేశారు.