స్కాలర్‌షిప్స్ అందజేయడం అభినందనీయం
స్కాలర్‌షిప్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు
ముషీరాబాద్, ఏప్రిల్ 22(విజయక్రాంతి): స్కాలర్‌షిప్స్ ద్వారా విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆభరణాల రిటైల్ సంస్థ మలబార్ గోల్డ్, డైమండ్స్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తాము ప్రకటించిన రూ.200 కోట్ల సీఎస్‌ఆర్ నిధుల కేటాయింపులో భాగంగా తెలంగాణలోని రూ.5,050 మంది విద్యార్థులకు రూ.4.55 కోట్ల విలువైన స్కాలర్షిప్లను బుధవారం బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా సంస్థ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆషర్ ఓ, ’రెస్ట్ అఫ్ ఇండియా’ రిటైల్ హెడ్ సిరాజ్ పి.కె మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు, సామాజిక ప్రభావంపై ఈ సంస్థకు ఉన్న దీర్ఘకాలిక దృష్టి ద్వారా ఇప్పటికే 18 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు.
విద్యా రంగం లో గత కొన్నేళ్లుగా 1.15 లక్షల మందికి పైగా విద్యార్థులకు రూ.100 కోట్లకు పైగా స్కాలర్షిప్ సహాయాన్ని అందించిందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను, తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులతో సహా, భారత దేశ వ్యాప్తంగా 33,000 మంది బాలికా విద్యార్థులకు స్కాలర్షిప్లను ఈ సంస్థ కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ హైదరాబాద్ జోన్, జోనల్ హెడ్ షరీజ్ కె, ఇతర సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు.






