ప్రశాంతంగా బక్రీద్‌ను నిర్వహించాలి
డీసీపీ రమణరెడ్డి
జూబ్లీహిల్స్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ప్రశాంత వాతావరణంలో బక్రీద్ నిర్వహణే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని డీసీపీ రమణ రెడ్డి అన్నారు. పండుగ నేపథ్యంలో జూబ్లీహిల్స్ జోన్ స్థాయి సమన్వ య సమావేశాన్ని మధురానగర్ పీఎస్ పరిధిలోని కమ్యూనిటీ హాల్లో బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ మా ట్లాడుతూ పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్టుల వద్ద మూడు షిఫ్టు ల్లో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా తెల్లవారుజాము 3 నుంచి 7 గంటల వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయపరచుకోవాలని, జంతు పరిరక్షణ చట్టాలను అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. మతసామరస్యాన్ని కాపాడేలా ప్రజలంతా సహకరించా లని కోరారు.
జిహెచ్‌ఎంసీ, పోలీసు యంత్రాంగం కలిసి పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని డీసీపీ వెల్లడించారు. వెటర్నరీ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తారన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో చట్టపరిధిలో జరుపుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, జిహెచ్‌ఎంసి డీసీఎం సురేశ్, వెటర్నరీ అధికారులు పాల్గొన్నారు.






