28 August, 2026 | 12:10 AM

​ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి.

27-08-2026 04:41 PM

ధర్నా చౌక్ లో ‘టీజీఈజేఏసీ’ (TGEJAC) మహాధర్నా 

జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పణ

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు , పెన్షనర్ల సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ వద్ద గురువారం మహాధర్నా నిర్వహించారు.  ఈ ధర్నా కార్యక్రమానికి వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ విధులకు సెలవు పెట్టి స్వచ్ఛందంగా తరలివచ్చారు.

​మహాధర్నాను ఉద్దేశించి TGEJAC జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ... హాజరైన ఉద్యోగ ప్రభంజనాన్ని చూస్తుంటే ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ వర్గాలు నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నాయన్నారు. వారి ఆర్థిక, సేవా, ఆరోగ్య భద్రతను నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా వారు టీజీఈజేఏసీ తరఫున ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు:

  1. ​2వ వేతన సవరణ కమిషన్ నుండి నివేదికను తెప్పించుకొని తక్షణమే అమలు చేయాలి.
  2. ​ఉద్యోగులు, పెన్షనర్లకు రావలసిన 6 D.A(కరువుభత్యాలను) వెంటనే విడుదల చేయాలి.
  3. ​నెలకు రూ 2,000 కోట్ల చొప్పున పేరుకుపోయిన సుమారు రూ 10,000 కోట్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు/బిల్లులను తక్షణమే మంజూరు చేయాలి.
  4. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను పూర్తిగా రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.
  5. ​నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను (NEHS) నగదు రహిత ప్రాతిపదికన సక్రమంగా అమలు చేయాలి.

​అనంతరం, ధర్నా చౌక్ నుండి భారీ నిరసన ర్యాలీగా వెళ్ళి, తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని  ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రభుత్వానికి పంపాల్సిందిగా కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్  సమర్పించారు. ​ఈ కార్యక్రమంలో TGEJAC జిల్లా నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల సంఘాల ప్రతినిధులు, పెన్షనర్లు మరియు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.