మాదిగలు అన్ని రంగాల్లో సత్తా చాటాలి
- ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ నరసింహ రావు
చెన్నూర్,(విజయక్రాంతి): మాదిగలు విద్య, ఉద్యోగం, రాజకీయ తదితర అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నరసింహరావు పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ పొన్నాల మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకుంటూ, మాదిగల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరంతరం పోరాడుతూ, సమాజ అభివృద్ధిలో మాదిగలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మాదిగలకు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాదిగల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం ఎమ్మార్పీఎస్ చేస్తున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన కోరారు. విద్య, ఉద్యోగ రంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా సమాజం చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దాసరి వీరమణి మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలగూర తిరుపతి, జిల్లా అధ్యక్షుడు ఆకుదారి రాజబాపు, మండల అధ్యక్షుడు పొన్నాల ప్రదీప్ మాదిగ, అటకపురం సతీష్ మాదిగ, గజ్జెల రమేష్, కాసిపేట లచ్చన్న, కాసిపేట రాజన్న తదితర నాయకులు పాల్గొన్నారు.






