calender_icon.png 22 February, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీపై ఉగ్రకుట్ర

22-02-2026 12:49:15 AM

వెలుగులోకి ఉగ్రవాదుల విధ్వంస ప్రణాళికలు

భారీ విధ్వంసానికి లష్కరే తైబా ప్రణాళికలు

ఆలయాలే టార్గెట్.. గుర్తించిన భారత నిఘా వర్గాలు

దేశ రాజధానితోపాటు అన్ని ప్రధాన నగరాల్లో హైఅలెర్ట్

చెంచల్‌గూడ జైలు నుంచే కుట్ర జరిగిందని అనుమానాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశ రాజధాని ఢిల్లీ నడొబొడ్డున ఉన్న ఎర్రకోట సమీపంలోని పురాతన ఆలయాలను లష్కరే తైబా అనే ఉగ్రవాద సంస్థ టార్గెట్ చేసింది. ఐఈడీ బాంబులతో వాటి విధ్వంసానికి పక్కా ప్రణాళికలు రచించింది. పాక్‌స్థాన్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ ఈ విధ్వంస రచన చేస్తోందని తాజాగా భారత నిఘా వర్గాలు పసిగ ట్టాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీతోపా టు ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో హైఅలెర్ట్ ప్రకటించాయి.

ఢిల్లీ పోలీసులు మహానగర వ్యాప్తం గా ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఆలయాల వద్ద పహారా కాస్తున్నారు. ఎత్తున భవనాల పైనుం చి స్నైపర్లు నగరంపై నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించేం దుకు సీసీ టీవీలను కెమెరాలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు వ్యూహాత్మక ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారు.

ఈనెల 6న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో భారీ పేలుడు సంభవించి 31 మంది మరణించారు. ఈ పేలుడు వెనుక భారత్‌కు సంబంధం ఉందని లష్కరే తైబా భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తోందని భారత నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. భారత్‌లో మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని లష్కరే తైబా కుట్ర పన్నుతోందని తెలిపాయి.

చెంచల్‌గూడ జైలు నుంచే ప్లాన్?

ఉగ్రవాదులు హైదరాబాద్‌లోని చెంచల్‌గూడ జైలు నుంచే ఎర్రకోట సమీపంలోని ఆలయాల విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జైలులో ఉన్న కొందరి ములాఖత్‌కు వచ్చిన వారు ఈ కుట్రకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నాయి. అయితే.. ఆ ఆరోపణలను తెలంగాణ జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా ఖండించారు. చెంచల్‌గూడ జైలు నుంచే ఉగ్ర కుట్ర జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపడేశారు. కొన్ని మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా వినియోగదారులు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అమృత్‌సర్, కశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం

పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరంలో ఉగ్రవాదులు పన్నిన విధ్వంస కుట్రను ఆ రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ మద్దతుతో ఉగ్రవాదులు కుట్రకు పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు నగరంలో పలుచోట్ల తనిఖీలు చేపట్టి ఒక ఐఈడీ బాంబ్‌ను నిర్వీర్యం చేశారు.

ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లోని గందర్ బాల్ జిల్లా సాఫాపోరలోనూ భద్రత బలగాలు ఒక ఐఈడీ బాంబ్‌ను నిర్వీర్యం చేశా యి. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని హైకోర్టును పేల్చివేస్తామని, కోర్టు పరిధిలో ఆర్డీఎక్స్ అమర్చామని గుర్తుతెలియని వ్యక్తు లు ఈమెయిల్ పంపించడంతో కోర్టు అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు కోర్టులో సోదాలు నిర్వహించి, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తెలిపాయి.