22-02-2026 12:46:52 AM
ఇరు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్ల వాణిజ్యానికి అడుగులు
ఒప్పందాల్లో కీలకమైనది.. అరుదైన, క్లిష్టమైన ఖనిజాల ఒప్పందం
ఈ ఒప్పందంతో ఈవీ, స్మార్ట్‌ఫోన్, జెట్ ఇంజన్ల తయారీకి బూస్టింగ్
గ్లోబల్ సౌత్ దేశాల మధ్య మైత్రి డబుల్: ప్రధాని మోదీ
డిజిటల్ సూపర్ పవర్ భారత్: బ్రెజిల్ అధ్యక్షుడు లూలా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశ రాజధాని ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శనివారం భారత్, బ్రెజిల్ దేశాల మధ్య 10 చారిత్రక వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వీటిలో భారత్‌కు బ్రెజిల్ నుంచి అరుదైన, క్లిష్టమైన ఖనిజాల సరఫరా అత్యంత కీలకమైనది. భారత ప్రధానని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేస్తాయని ఇద్దరు దేశాధినేతలు ఆకాంక్షించారు.
రెండు దేశాల మధ్య రానున్న ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.66 లక్షల కోట్లు) వాణిజ్యం జరగాలని టార్గెట్ నిర్దేశించారు. ఇవి కేవలం అంకెలు కాదని, ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి ప్రతిరూపమని అభివర్ణించారు. అరుదైన ఖనిజాల ఒప్పందంతో విద్యుత్ వాహనాలు, మొబైల్స్, జెట్ ఇంజన్ల తయారీరంగం కొత్త పుంతలు తొక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు. బ్రెజిల్ సహజ వనరులు, భారత్ సాంకేతిక నైపుణ్యాలు కలిస్తే గ్లోబల్ సౌత్ దేశాల బలం మరింత పెరుగుతుందని ఆకాంక్షించారు. ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరాలో కూడా బ్రెజిల్ నుంచి భారత్‌కు పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
భారత్‌లో డిజిటల్ విప్లవం: లూలా
డిజిటల్ రంగంలో భారత్ విప్లవం సాధించిందని ప్రగతిని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ప్రశంసించారు. భారత్ ‘డిజిటల్ సూపర్ పవర్’ అని కొనియాడారు. బ్రెజిల్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏఐ, సెమీకండక్టర్లు, బ్లాక్ చెయిన్ వంటి అధునాతన సాంకేతికతలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయమని స్పష్టం చేశారు. అలాగే అంతర్జాతీయ సంస్థల పనితీరుపైనా ఇరుదేశాధినేతలు ప్రసంగించారు.
అంతర్జాతీయ సంస్థల్లో మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ప్రకటించారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే శక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.
10 ఒప్పందాలు ఇవే
అరుదైన, క్లిష్టమైన ఖనిజాల సరఫరాకు సహకారం
రెండు దేశాల మధ్య మైనింగ్, ఉక్కు సరఫరా చైన్ లింక్ అభివృద్ధి
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో సాంకేతికత మార్పిడి
డిజిటల్ భాగస్వామ్యంలో పరస్పర సహాయ సహకారాలు
వైద్యారోగ్య రంగం, ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధిలో భాగస్వామ్యం
సంప్రదాయ విజ్ఞానాన్ని పంచుకోవడంపై అవగాహన
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమ రంగాల బలోపేతం
మాస్ కమ్యూనికేషన్ రంగంలో పరస్పర సహకారం
పునరుత్పాదక ఇంధనం, ఇథనాల్ బ్లెండింగ్‌లో సాంకేతిక భాగస్వామ్యం
రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ