యూపీ అతలాకుతలం: తుఫాను బీభత్సం— గాలిలో ఎగిరిపోయిన వ్యక్తి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాలను భారీ తుఫాను,కుండపోత వర్షాలు అతలాకుతలం చేయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనల్లో కనీసం 89 మంది మరణించినట్లు సహాయక కమిషనర్ కార్యాలయం తెలిపింది. బుధవారం నాడు అకాల వర్షాలు, ఉరుములు, మెరుపుల కారణంగా సంభవించిన ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) పరిగణనలోకి తీసుకుని, బాధితులైన కుటుంబాలకు 24 గంటల్లోగా సహాయక చర్యలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
యూపీలోని బరేలీ నన్హే మియాన్ అనే వ్యక్తి ఒక వివాహ వేదిక వద్ద నిలబడి రేకుల షెడ్డును పట్టుకుని ఉండగా, బలమైన గాలులకు ఆ రేకుల షెడ్డుతో పాటు గాలిలో ఎగిరి(Terrifying Man Flying), దూరంగా పొలాల్లో పడ్డాడు. ఈ ప్రమాదంలో అతని చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అతను ఆస్పత్రికలో చికిిత్స పొందుతున్నాడు. గాలులకు వ్యక్తి గాలిలో ఎగిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గురువారం నాడు X వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో "మే 13న సంభవించిన తుఫానులు, వర్షాలు, వడగళ్ల వాన, పిడుగులతో కూడిన ప్రతికూల వాతావరణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 89 మరణాలు, 53 మందికి గాయాలు, 114 పశువుల మరణాలు, 87 ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు నివేదికలు అందాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకున్నారు." అని సహాయక కమిషనర్ కార్యాలయం ఇలా పేర్కొంది.






