పోడు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కెరమెరి మండలం సుర్ధాపూర్ గ్రామానికి చెందిన పోడు రైతుల సమస్యలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సోమవారం పోడు భూములను సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటికే పోడు భూముల్లో విత్తనాలు వేశామని, ప్రస్తుతం ఎరువులు వేసేందుకు వెళ్లగా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భూముల చుట్టూ కందకాలు తవ్వడంతో సాగు పనులు పూర్తిగా నిలిచిపోయాయని సుగుణక్క దృష్టికి తీసుకువచ్చారు.రైతుల సమస్యలు విన్న సుగుణక్క మాట్లాడుతూ... తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూముల విషయంలో గిరిజన రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. సుర్ధాపూర్ పోడు రైతుల సమస్యను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి గిరిజన రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి గిరిజన రైతుల సాగుకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.






