19 May, 2026 | 6:26 AM

మంచిర్యాలలో తెలంగాణ మారథాన్

19-05-2026 12:00 AM

ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు ః కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, మే 18 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పని సరి అని, ప్రభుత్వం సైతం ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతుందని, అందు కోసం అనేక చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. తెలంగాణ మారథాన్-ఫిజికల్ లీటరసి కార్యక్రమంలో భాగంగా సోమ వారం జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని జిల్లా క్రీడాధికార సంస్థ మైదానం వరకు చేపట్టిన మారథాన్ లో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్,గుడిపేట 13 బెటాలియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి హనుమంత రెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, ఏసీపీ ప్రకాష్, యువతీ యువకులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో యువ జనాభా అధికంగా ఉందని, రాష్ట్ర, దేశాభివృద్ధిలో యువత అత్యంత కీలకమని, ఉత్సాహంగా యువత పాల్గొనాలన్నారు. ఆరోగ్యం, క్రమశిక్షణ కలిగి ఉండాలని, వ్యాయామం, యోగ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు. మాదక ద్రవ్యాలు, మద్యం వల్ల కలిగే అనర్ధాలను తెలుసుకొని యువత వాటికి దూరంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత తెలంగాణగా సమిష్టిగా కృషి చేయాలన్నారు.

‘నో టు డ్రగ్స్ - ఎస్ టు ఎక్స్సజ్’ నినాదం దిశగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం వైపు అడుగులు వేయాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో యువతి యువకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.