19 May, 2026 | 6:13 AM

బక్రీద్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

19-05-2026 12:00 AM

కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్, మే 18 (విజయక్రాంతి): బక్రీద్ పండుగను జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బక్రీద్ పండుగ ఏర్పాట్లపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈద్గాలు, మసీదుల వద్ద ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. పండుగ నేపథ్యంలో పురపాలక, గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈద్గాల పరిసరాల్లో పరిశుభ్ర వాతావరణం కల్పించాలని సూచించారు. అలాగే ప్రార్థనల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, అడిషనల్ ఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్, భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్లు అప్పాల గణేష్ చక్రవర్తి, బిబి కుతిజ సిద్ధికి, వివిధ శాఖల అధికారులు, హిందు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.