రసాభాసగా మున్సిపల్ సమావేశం
రూ.100 కోట్ల విజయ డెయిరీ స్థలాన్ని
కాంగ్రెస్‌కు కేటాయించడాన్ని నిరసించిన బీజేపీ
చైర్మెన్ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపిన కౌన్సిలర్లు
ఆదిలాబాద్, మే 18 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగ సాగింది. చైర్పర్సన్ బండారి అనూష్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం పట్టణంలోని 100 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించడాన్ని నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. సమావేశానికి ముందు మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమావేశంలోనూ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
పట్టణ నడిబొడ్డున 100 కోట్ల విలువైన విజయ డెయిరీ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తూ బీజేపీ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం వద్దకు దూసుకు వెళ్లి నిరసన తెలిపారు. కుట్ర పూరితంగానే ఎజెండా కాపీలను తమకు ఆలస్యంగా అందించారని మండిపడుతూ ఎజెండా కాపీలను చించివేసి నిరసన తెలిపారు. నిరు పేదలకు ఇంటి స్థలం కేటాయించేందుకు సవాలక్ష కారణాలు చూపే యంత్రాంగం విలువైన స్థలాన్ని అప్పనంగా అప్పగించడం పై కమీషనర్ జగదీశ్వర్ గౌడ్ తో సభ్యులు వాగ్వాదానికి దిగారు.
దీంతో సమావేశంలో కానేపు గందరగోళం నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను సముదాయించారు. అనంతరం ఎలాంటి చర్చ సాగకుండానే రెండు ఎజెండా అంశాలను సమావేశం ఆమోదించింది. అనంతరం చైర్పర్సన్ బండారి అనూష మీడియాతో మాట్లాడుతూ... పట్టణంలోని ఎలాంటి స్థలం కేటాయించాలన్న పాలకవర్గ ఆమోదం పొందాల్సి ఉంటుందని, ఇదే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నో అబ్జెక్షన్ (NOC) పత్రం జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.
మిగతా ప్రక్రియ మొత్తం కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ ఆధీనం జరుగుతుందని తెలియజేశారు. పట్టణంలో మౌళిక సదుపాయాల కల్పన కు పట్టణ అభివృద్ధి పథకం నిధులు రూ. 20 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఆమోదించుకున్నట్లు తెలిపారు.






