8 March, 2026 | 3:11 AM

గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన జ్యూరీ కమిటీ

08-03-2026 01:19 AM

ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి

ఉగాది రోజు అవార్డుల ప్రదానం

తెలంగాణ గద్దర్ సినీ అవార్డులను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికెట్ పొందిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించారు. ‘గద్దర్ సినీ పురస్కారాలు మొత్తం 90 ఎంట్రీలు వచ్చాయి. ఇందులో 68 ఫీచర్ ఫిలిమ్స్ కాగా, 22 లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు, బాలల చిత్రాలు ఉన్నాయి.

శనివారం అవార్డుల జాబితాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జ్యూరీ కమిటీ అందజేసింది. అనంతరం ఎఫ్‌డీసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో వివరాలను ప్రకటించారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యూరీ కమిటీ చైర్మన్ మణిశర్మ, సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ల భరణి, ఎఫ్‌డీసీ ఎండీ ప్రియాంక పాల్గొన్నారు. ఉగాది రోజు (మార్చి 19వ తేది) ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. 

‘ఛాంపియన్’కు 5.. ‘రాజు వెడ్స్ రాంబాయి’కి 4 అవార్డులు 

ఈసారి ఉత్తమ నటుడు పురస్కారం అక్కినేని నాగచైతన్యను వరించగా, రష్మిక మందన్నకు ఉత్తమ నటి అవార్డును ప్రకటించారు. ఉత్తమ దర్శకుడు పురస్కారానికి సాయిలు కంపాటి ఎంపికయ్యారు. అత్యధికంగా ఐదు పురస్కాలను దక్కించుకున్న సినిమాగా ‘ఛాంపియన్’ చిత్రం సత్తా చాటింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’.. మొత్తం 4 అవార్డులతో ఎక్కువ పురస్కారాలు పొందిన రెండో చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ‘దండోరా’ సినిమాకు మూడు అవార్డులు దక్కాయి.

ఇక ఈసారి ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి అగ్ర నటుడు చిరంజీవిని ఎంపిక చేశారు. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ను పైడి జయరాజ్ అవార్డు వరించింది. గద్దర్ అవార్డుల్లో ఈ సారి కొత్తగా సీ నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డును చేర్చింది రాష్ట్ర సర్కారు. కాగా, ఈ సినారె అవార్డుతో గేయ రచయిత సుద్దాల అశోక్ తేజను సత్కరించనున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో సముచితమైన స్థానం దక్కింది.

బాపూజీ జీవితం ఆధారంగా యువ దర్శకుడు బడుగు విజయ్‌కుమార్ ‘యూనిటీ: ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి చిరందాస్ శ్రీకాంత్ నిర్మాత. బాపూజీ తెలంగాణ సమాజానికి మరో గాంధీ ఎలా అయ్యారనే విషయాన్ని ఆసక్తికరంగా పెద్దల నుంచి పాఠశాల విద్యార్థులకు సైతం సులభంగా అర్థమయ్యేలా ‘యూనిటీ’ డాక్యుమెంటరీని విజయ్‌కుమార్ చిత్రీకరించారు. మైమ్ మధు, బాల నటుడు భాను ప్రధాన పాత్రలు పోషిస్తూ బాపూజీ కథను వివరించారు. ఇప్పటికే యూనిటీ డాక్యుమెంటరీ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూడా శభాష్ అనిపించుకొని అవార్డులు అందుకుంది. 2025లో ఢిల్లీలో జరిగిన 15వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కించుకుంది. 

ప్రత్యేక పురస్కారాలు 

ఎన్టీఆర్ జాతీయ అవార్డు: చిరంజీవి

పైడి జయరాజ్ అవార్డు: కమల్ హాసన్

బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డు-: సింగీతం శ్రీనివాసరావు

నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: అశ్వనీదత్

కేఎల్ కాంతారావు ఫిల్మ్ అవార్డు: -ఆర్.నారాయణమూర్తి 

రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: రమేశ్ ప్రసాద్

సీ నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు: సుద్దాల అశోక్ తేజ 

అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు: జయసుధ

ఫీచర్ ఫిల్మ్స్

ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి

ఉత్తమ ద్వితీయ చిత్రం: దండోరా

ఉత్తమ తృతీయ చిత్రం: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం: తండేల్ 

ఉత్తమ పర్యావరణ చిత్రం: ఇగ్వా 

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (డెబ్యూ): లిటిల్ హార్ట్స్

ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం

ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం: కోర్ట్ 

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్: మిరాయ్

ఉత్తమ బాలల చిత్రం: అనగనగా

ఉత్తమ దర్శకుడు: సాయిలు కాంపాటి (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ నటుడు: నాగచైతన్య (తండేల్)

ఉత్తమ నటి: రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్)

ఉత్తమ సహాయ నటుడు: శివాజీ (దండోరా)

ఉత్తమ సహాయ నటి: భూమిక (యుఫోరియా)

ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కే రాబిన్ (దండోరా)

ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి) 

ఉత్తమ గాయని: సాహితి (కన్నప్ప)

ఉత్తమ హాస్య నటుడు: కృష్ణతేజ్ రెడ్డి (జిగ్రీస్)

ఉత్తమ బాలనటుడు: మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో) 

ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)

ఉత్తమ స్క్రీన్‌ప్లే-: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)

ఉత్తమ గేయ రచయిత: నందకిశోర్ (కుబేర ‘నా కొడుకా’ పాట) 

ఉత్తమ ఛాయాగ్రహణం: కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)

ఉత్తమ కూర్పు: శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)

ఉత్తమ ఆడియోగ్రాఫర్: ఎంఆర్ రాధాకృష్ణన్ (కిష్కింధపురి)

ఉత్తమ కొరియోగ్రాఫర్: ఆట సందీప్ (ఛాంపియన్)

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి (ఛాంపియన్)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: వై గోవిందరాజు (అఖండ 2)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: చంద్రకాంత్ సొనావాని, అజయ్‌కుమార్ నంబాల (ఛాంపియన్)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్స్ (ఛాంపియన్)

స్పెషల్ జ్యూరీ అవార్డులు..

రాజ్ రాచకొండ (23 ఫిల్మ్)

చైతన్య జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)

రోషన్ మేక (ఛాంపియన్) 

అనంతిక సనీల్ కుమార్ (8 వసంతాలు)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ 

యూనిటి ఆఫ్ సోషల్ జస్టిస్ లక్ష్మణ్ బాపూజీ జీవిత విశేషాలు (చిరందాస్ శ్రీకాంత్) 

ది ఫస్ట్ యాక్షన్ హీరోత జయరాజ్ ప్రస్థానం (పొన్నం రవిచంద్ర) 

మహా మనిషి డాక్టర్ ఏఎస్ రావు (బాలబ్రహ్మచారి పూసపాటి) 

ఉత్తమ లఘుచిత్రాలు

వనజీవి రామయ్య (భూసం రవీంద్రనాథ్) 

మౌనమే నీ భాష (రవీంద్రవర్మ ఇందుకూరి, విశ్వాస్ హనుకర్) 

సైబర్ స్లేవరీ (కే నీలిమ) 

డిప్లొమా ఆఫ్ మెరిట్: తల్లిదండ్రుల ఆత్మ గౌరవం (కనపర్తి హనుమండ్లు) 

బెస్ట్ బుక్ ఇన్ తెలుగు

శూన్యం నుంచి శిఖరాగ్రాలకు (ప్రభు)

ఉత్తమ సినీ విమర్శకుడు

హెచ్ రమేశ్ బాబు