ఈమె తుపాకీని కాదు.. చట్టాన్ని నమ్ముతుంది!
అందాల భామ సంయుక్త ప్రస్తుతం తన కెరీర్‌లో తొలిసారి హీరోయిన్ -సెంట్రిక్ పాన్ -ఇండియన్ యాక్షన్ డ్రామా ‘ది బ్లాక్ గోల్డ్’లో నటిస్తున్నారు. యోగేశ్ కేఎంసీ దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై మాగంటి పిక్చర్స్‌తో కలిసి రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మురళి శర్మ, రావు రమేశ్, నాసర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, బీవీఎస్ రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూవీటీమ్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరోయిన్ సంయుక్త ప్రమాదకరమైన మైనింగ్ ప్రాంతం మధ్యలో నిలబడి, చేతిలో రైఫిల్ పట్టుకుని ఉండటం ఆకట్టుకుంటోంది. ‘She Believes in the Law, Not the Gun!’ (ఆమె తుపాకీని కాదు, చట్టాన్ని నమ్ముతుంది) అనే ట్యాగ్‌లైన్ కథలోని హీరోయిన్ పాత్రపై క్యూరియాసిటీని పెంచుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. కేవలం చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఈ వేసవిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంగీతం సామ్ సీఎస్ స్వరపరిచారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.




