8 March, 2026 | 2:55 AM

ఎవరికి జోడీ..?

08-03-2026 01:12 AM

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోమారు కలిసి వస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకాదరణ పొందింది. ‘ఎఫ్2’, ‘ఎఫ్3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘వెంకీ 5’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

ఇదిలావుండగా, ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్‌రామ్ మరో హీరోగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి ‘పటాస్’ సినిమాతో కళ్యాణ్‌రామ్‌కు మంచి హిట్ ఇచ్చారు. అదే అనిల్ తొలిచిత్రం. ఇక ఆయన ఇప్పడు మరోసారి తన మొదటి హీరోతో కలిసి పనిచేస్తుండటం కూడా ఈ చిత్రంపై అంచనాలు నెలకొనడానికి కారణం. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్న తాజా సినిమా.. అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చిన సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే 2027 బరిలో మళ్లీ అనిల్ దిగబోతున్నారన్న మాట. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఇద్దరు హీరోల సరసన నటించే కథానాయికల కోసం అనిల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్లను వెతికే పనిలో ఉన్నారు.

తాజాగా ఒక హీరోయిన్‌గా మహానటి కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే కీర్తి.. ఎవరికి జోడీ అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. వెంకీ మామకా? కళ్యాణ్‌రామ్‌కా..? అనేది సెకండ్ హీరోయిన్‌ను ఎంపిక చేశాకే తెలుస్తుంది. కొందరు మాత్రం వెంకీ సరసనే కీర్తి నటిస్తోందని అంటున్నారు.  వెంకటేశ్ మార్కు టైమింగ్, అనిల్ రావిపూడి కామెడీకి తోడు ఇప్పుడు కీర్తి సురేశ్ లాంటి పెర్ఫార్మర్ తోడవడంతో ఈ ప్రాజెక్ట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కీర్తి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.  మరి అనిల్ రావిపూడి.. ‘మహానటి’కి విజయాన్ని అందిస్తారా..?! చూడాలి.