18 April, 2026 | 1:41 AM

ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ

18-04-2026 12:00 AM
  1. ప్రస్తుత సవాళ్లు, మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఎకో సిస్టం’ అభివృద్ధి
  2. ఆర్‌అండ్‌డీ, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్‌పై ప్రత్యేకదృష్టి
  3. ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): భవిష్యత్ ‘ఏరోస్పేస్’ రంగ అవసరాలకు అనుగు ణంగా ‘తెలంగాణ’ను దేశానికి ఒక వ్యూహాత్మక హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆర్‌అండ్‌డీ, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్... ఈ మూడింటిని అనుసంధానించగలిగే దేశాలు, రాష్ట్రాలే రాబోయే రోజుల్లో ‘ఏరోస్పేస్’లో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతాయన్నారు.

ఆ దిశగా.. ఈ రం గంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్లు, మా ర్పుల్ని  అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. శుక్రవారం ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘ఛేంజింగ్ సినారియో ఇన్ ఏరోస్పేస్, ఆర్‌అండ్‌డీ, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సర్టిఫికేషన్’ అనే అం శంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... ‘ఏరోస్పేస్’ అంటే కేవలం యంత్రాల తయారీ మాత్రమే కాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక దేశ వ్యూహాత్మక శక్తికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఈ రంగంలో ఒకప్పుడు.. అమెరికా, రష్యా, ఐరోపా దేశాలదే ఆధిపత్యం చెలాయించేవని, ఇప్పుడు వాటికి ధీటుగా ‘గ్లోబల్ సప్లై చైన్’లో మన దేశం కూడా ‘కీ’ రోల్ ప్లే చేస్తోందన్నారు. యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపం చంలోనే అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు, ఇంజనీర్లు మన దేశంలోనే ఉన్నారన్నారు.

కానీ... మెకి న్సే నివేదిక ప్రకారం.. ల్యాబ్స్‌లో జరిగే పరిశోధనల్లో 30 శాతం కూడా కమర్షియల్ మాన్యుఫ్యా క్చరింగ్‌కు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిశోధనల్ని ఉత్పత్తులుగా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా ప్రత్యే క కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు. డెలాయిట్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫె న్స్ సర్వే ప్రకారం... నేడు 74 శాతం మంది ఏరోస్పేస్ సీఈఓలు కేవలం తక్కువ ఖర్చు కంటే పటి ష్ఠమైన సప్లై-చైన్, తయారీ సామర్థ్యానికే ప్రాధాన్యమిస్తున్నారన్నారు.

రాబోయే 20 ఏళ్లలో ప్రపం చవ్యాప్తంగా 42,000 కొత్త ఎయిర్ క్ట్రాఫట్స్ అవసరం ఉంటుందని బోయింగ్, ఎయిర్బస్ సంస్థలు అంచనా వేశాయని తెలిపారు. ఈ డిమాండ్‌ను ‘హైదరాబాద్’ అందిపుచ్చుకునేలా ఇప్పటికే ఇక్కడున్న ప్రిసిషన్ ఇంజనీరింగ్, డిఫెన్స్ మాన్యు ఫ్యాక్చరింగ్ నెట్‌వర్క్, బలమైన ఎంఎస్‌ఎంఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఇప్పటికీ మనం ఏరోస్పేస్ టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు.

ఫలితంగా ఖర్చు పెరగడమే కాకుండా... ఉత్పత్తుల గ్రౌండింగ్‌కు 18 నెలల నుంచి 24 నెలల వరకు అదనపు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న 1,500కు పైగా ఎంఎస్‌ఎంఈలు ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తూ ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు.

‘హైదరాబాద్’ వేదికగా ఏరో స్పేస్ భవిష్యత్తును నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలను మంత్రి శ్రీధర్ బా బు ఆహ్వానించారు.

అనంతరం ఏరోస్పేస్ రం గంలో విశేష కృషి చేసిన పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులను ఆయన ఘనంగా సత్కరించారు.  నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్, డీజీ సీఎస్‌ఐఆర్ అండ్ డీఎస్‌ఐఆర్ సెక్రటరీ డీఎన్ కళైసెల్వి, ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు డాక్టర్లు సతీష్‌రెడ్డి, సోమనాథ్, రాజబాబు, శివ సుబ్రహ్మణ్యం  పాల్గొన్నారు.