టీచర్లకు మధ్యాహ్న భోజనం వద్దు
సమాజంలో ఉపాధ్యాయుల గౌరవానికి భంగం : ఎస్టీయూటీఎస్
ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): పాఠశాలల్లో విద్యార్థులకు అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయులకు కూడా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ సదానందంగౌడ్, జుట్టు గజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్న భోజన పథకం ప్రధాన ఉద్దేశం పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించి వారి ఆరోగ్యం, హాజరు శాతం, విద్యాభివృద్ధిని మెరుగుపరచడమేనని తెలిపారు.
ప్రభుత్వం తన దృష్టిని విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత మరింత మెరుగుపరచడంపైనే కేంద్రీకరించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు గౌరవ వేతనం పెంచి, బిల్లులను సకాలంలో చెల్లించాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సమాజంలో ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉందన్నారు.






