16 May, 2026 | 1:08 AM

గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ హబ్‌గా తెలంగాణ

16-05-2026 12:00 AM
  1. ఇంజినీరింగ్ ఎగుమతుల వృద్ధిలో కీలకం 
  2. టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టం అనుసంధానంపై ప్రత్యేక దృష్టి 
  3. ఈఈపీసీ ఇండియా సదరన్ రీజియన్ అవార్సు ఫర్ ఎక్స్‌పోర్ట్ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందని, రాష్ట్రాన్ని గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండస్ట్రియల్ పార్కులు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, లాజిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్లింగ్ ఎకో సిస్టం, ఇన్నోవేషన్ నెట్ వర్క్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు.

శుక్రవారం బేగంపేట్ ఐటీసీ కాకతీయలో నిర్వహించిన ‘48వ ఈఈపీసీ ఇండియా సదరన్ రీజియన్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌పోర్ట్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. 2024-25లో భారత్ నుంచి ఇంజనీరింగ్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 116.67 బిలియన్ డాలర్లు దాటాయన్నారు. ఇది మొత్తం మర్చండైస్ ఎగుమతుల్లో 27 శాతానికి చేరుకోవడం మన ఆర్థిక వ్యవస్థ పరిణతికి నిదర్శనమ న్నారు. దేశ ఇంజనీరింగ్ ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.

ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఈవీ మొబిలిటీ తదితర రంగాల్లో జాతీయ స్థాయిలో మన వాటా రోజురోజుకీ పెరుగుతోందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఇంజ నీరింగ్ ఎగుమతులు 7.5 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఇక్కడి పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనమ న్నారు. గతంలో మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ వేర్వేరు అని, ఇప్పుడు మాత్రం ఆ రెండింటిని అనుసంధానిస్తేనే గ్లోబల్ సప్లై చైన్‌లో కీలక పాత్ర పోషించగలమన్నారు.

ఆ దిశగా ‘మేడ్ ఇన్ తెలంగాణ‘ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేలా ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్‌తో కూడిన ఎకో సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు.

హైదరాబాద్ లో ఈఈపీసీ ప్రాంతీ య కార్యాలయాన్ని పునః ప్రారంభించేందుకు చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నీతి ఆయోగ్ మాజీ సీఈవో బీవీఆర్  సుబ్రహ్మ ణ్యం, ఈఈపీసీ ఇండియా ప్రతినిధులు పంకజ్ చా డ, రామన్ రఘు, శశి లూయిస్ పాల్గొన్నారు.