మూర్ఛతో చెరువులో పడి యువకుడి మృతి
20-08-2026 11:18 PM
నర్సాపూర్: చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు మూర్ఛ రావడంతో చెరువులో పడి మృతి చెందిన ఘటన నర్సాపూర్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... నర్సాపూర్ పట్టణంలోని సునీతా లక్ష్మారెడ్డి కాలనీకి చెందిన శ్రీశైలం (22) గత కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధ పడుతున్నాడు. గురువారం పట్టణ శివారులోని రాయారావు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువు ఒడ్డున చేపలు పడుతున్న సమయంలో అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో అదుపుతప్పి చెరువులో పడిపోయాడు. ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మూర్ఛ రావడంతోనే చెరువులో పడి మృతి చెందాడని, ఈ ఘటనపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని మృతుడి అక్క దుర్గమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.






