సింగపూర్ విద్యా పర్యటనకు ఎంపికైన జీడిపల్లి తండా ఉపాధ్యాయుడు
కల్వకుర్తి ఆగస్టు26(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచే లక్ష్యంతో చేపట్టిన టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్ ఎడ్యుకేషన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా సింగపూర్ విద్యా పర్యటనకు కల్వకుర్తి మండలం జీడిపల్లి తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రఘురామారావు ఎంపికయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 29 మంది ఉపాధ్యాయులు, 11 మంది విద్యాశాఖ అధికారులు కలిపి మొత్తం 40 మంది ప్రతినిధుల బృందం సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. ఈ సందర్భంగా అక్కడి పాఠశాలలను సందర్శించి భాష, సైన్స్, గణితం బోధనలో అమలు చేస్తున్న ఆధునిక, ప్రయోగాత్మక పద్ధతులను పరిశీలించనున్నారు.
అలాగే సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, డిజిటల్ తరగతులు, పాఠ్యప్రణాళిక, మూల్యాంకన విధానాలు, తరగతి గది అభ్యసన వాతావరణం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయుడు రఘురామారావు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఎంపిక పట్ల తోటి ఉపాధ్యాయులు, జీడిపల్లి తండా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.






