26 August, 2026 | 9:32 PM

రేపే పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల మహాధర్నా

26-08-2026 08:36 PM

పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, పెండింగ్‌ డీఏలు, హెల్త్‌ స్కీంపై ఉద్యోగుల ఆందోళన

పెద్దపల్లి,(విజయక్రాంతి) తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్‌, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, సెక్రటరీ జనరల్‌, టీజీవోస్‌ జిల్లా అధ్యక్షుడు తూము రవీందర్ పటేల్ తెలిపారు. పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు, పెండింగ్‌ డీఏల మంజూరు, ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాలకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. 

పెద్దపల్లి జిల్లాలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మహాధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల సాధన కోసం నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, బ్రాడ్‌కాస్ట్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా ప్రతినిధులు విస్తృత ప్రచారం కల్పించి సహకరించాలని వారు కోరారు.