8 August, 2026 | 2:13 AM

టీసీసీవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

08-08-2026 12:33 AM

వెంకటాపూర్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో గత రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లను విధుల నుంచి తొలగించడం బాధాకరమని జిల్లా కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ..

నిరుపేద కుటుంబాలకు చెందిన తాము దాదాపు 20 ఏళ్లుగా రెవెన్యూ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడం అన్యాయమని, తహసీల్దార్ కార్యాలయాల్లో ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన అనేక సేవలను తామే నిర్వహించామని, ఎన్నికల సమయంలో తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగాల నుంచే తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

గత కొన్ని నెలలుగా చేసిన పనికి కూడా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సిన పరిస్థితి నెల కొందని, రెవెన్యూ శాఖలో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్న నేపథ్యంలో, వీఆర్‌ఏలకు అవకాశం కల్పించినట్లే తమ 20 ఏళ్ల సేవలను పరిగణనలోకి తీసుకుని సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి కంప్యూటర్ ఆపరేటర్లను సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే స్పందించి కంప్యూటర్ ఆపరేటర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.