13 August, 2026 | 5:01 AM

హెజ్‌సీఏ అత్యుత్సాహంపై టీసీఏ ఆగ్రహం

13-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 12: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ జిల్లాల్లో తన అధికార పరిధిని ఏకపక్షంగా విస్తరించడం, సమాంతర జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం, ట్రయల్స్ నిర్వహించడం, వివాదాస్పద వ్యక్తులకు పట్టం కట్టడం వంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమ, అవినీతి చర్యలను టీసీఏ తీవ్రం గా ఖండించింది.

ఆగస్టు 17న బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ & అంబుడ్స్మన్ సమక్షంలో కీలక విచారణ జరగనున్న తరు ణంలో, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి హెచ్‌సీఏ చేస్తున్న ఈ హడావుడి చర్యలు అత్యంత అనుమానాస్పదంగా ఉన్నాయనీ టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు, బీసీసీఐ పరిశీలనలో ఉన్న విషయాలపై తుది తీర్పు రాకముందే, క్షేత్ర స్థాయిలో అక్రమ సామ్రాజ్యాలను నిర్మించుకోవడానికి హెచ్‌సీఏ పన్నిన పన్నాగంగా అభివర్ణించారు.

జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి చెందకూడదని టీసీఏ ఎప్పుడూ అనలేదనీ, కానీ, నిబంధనలకు విరుద్ధంగా, ఎవరో కబ్జా కోరులు దీన్ని శాసించడంపైనే తమ అసలు పోరాటంగా చెప్పుకొచ్చారు. గతంలో క్రమశిక్షణా చర్యలు, తీవ్ర ఆరోపణలతో రెండుసా ర్లు సస్పెన్షన్‌కు గురైన టీ. శేషనారాయణను జిల్లా క్రికెట్ ఇనన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా నియమించడం సుప్రీంకోర్టు ఆమోదించిన లోధా సంస్కరణలకు, బీసీసీఐ నిబంధనలకు నేరుగా తూట్లు పొడవడమేనన్నారు.

ఈ నియామకానికి గల చట్ట బద్ధత ఏమిటో హెచ్‌సీఏ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టీసీఏను, స్థానిక జిల్లా వ్యవస్థలను పూర్తిగా పక్కనబెట్టి హెచ్‌సీఏ నడిపే ఈ ఏకపక్ష ట్రయల్స్ వల్ల గ్రామీణ ప్రాంతాల అమాయక ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని గురువా రెడ్డి ఆరోపించారు. కొందరి స్వార్థ రాజకీయాల కోసం యువ క్రికెటర్ల ప్రతిభను బలిగొనే ఈ ‘పేకప్ మేనేజ్మెంట్’ సంస్కృతిని టీసీఏ ఏమాత్రం సహించదన్నారు. హెచ్‌సీఏ చేసిన అక్రమ నియామకాలు, ఉత్తర్వులు, ఏకపక్ష నిర్ణయాలకు సంబంధించిన పక్కా ఆధారాలన్నింటినీ బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ & అంబుడ్స్మన్ ముందు ఉంచుతున్నామనీ తెలిపారు.