13 August, 2026 | 3:42 AM

ప్రతి జిల్లాలో హెచ్‌సీఏ కార్యాలయాలు

13-08-2026 12:00 AM

గ్రామీణ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు: శేషనారాయణ

హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణలో క్రికెట్ను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేసేందుకు ప్రతి జిల్లాలో హెచ్‌సీఏ కార్యాలయాలను ఏర్పా టు చేయనున్నట్లు జిల్లా క్రికెట్ మౌలిక వసతుల అభివృద్ధి కమిటీ చైర్మన్ టి. శేషనారాయణ తెలిపారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు, మూడు నెలల్లో జిల్లాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసి, స్థానిక క్రీడాకారుల సమస్యలు, సెలక్షన్లకు సంబంధించిన దరఖాస్తులను అక్కడే స్వీకరిస్తామని చెప్పారు.

స్కూళ్లు, కళా శాలల్లో క్రికెట్ మైదానాలు, మౌలిక వసతులు కల్పించి ప్రతిభను వెలికితీస్తామన్నారు. జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను హెజ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ ఎ.టి. రాయుడు పరిశీలిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని శేషనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే సూర్యాపేట, జగిత్యాల, నాగర్కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో బీసీసీఐ ప్రమాణాలతో నాలుగు అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అంబటి రాయుడు ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

జిల్లా క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాల్లో టీజీ20 ఫ్రాంచైజీలను భాగస్వామ్యం చేయనున్నట్లు శేషనారాయణ తెలిపారు. ఫ్రాంచైజీల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెటర్లకు మెరుగైన శిక్షణ, అవకాశాలు కల్పించడంతో పాటు, స్థానికంగానే ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయి ఎంపికలకు తీసుకెళ్లేందుకు వీలవుతుందన్నారు. క్రికెట్ అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి చేరేలా చర్యలు తీసుకుంటామని శేషనారాయణ స్పష్టం చేశారు.