తంగళ్లపల్లి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో పోస్టులు భర్తీ చేయాలి
జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యలు విన్నవించిన మండల సర్పంచుల
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు పరిపాలనా సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తంగళ్లపల్లి మండల సర్పంచుల ఫోరం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్‌ను కలిసి మండలంలో నెలకొన్న సమస్యలను వినిపిస్తూ వినతిపత్రం సమర్పించారు.
మండలంలో ముఖ్య అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజల పనులు ఆలస్యం అవుతున్నాయని, రెవెన్యూ మరియు అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా సాగడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని సర్పంచులు తెలిపారు. ముఖ్యంగా పింఛన్లు, ధరణి సమస్యలు, గ్రామాభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే తహసీల్దార్, ఎంపీడీవో పోస్టులను భర్తీ చేసి మండల ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పూర్మాని రాజశేఖర్ రెడ్డి, ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.






