శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ వేటు పడింది. ఛైర్మన్ పోడియం వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసనలు తెలిపారు. ఒక రోజు పాటు మండలి నుంచి సస్పెండ్ చేస్తూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మండలిలో అడుగడుగుగా బీఆర్ఎస్ సభ్యులు నిరసనలు తెలిపారు. దీంతో మధూసూదనాచారి, తుక్కలపల్లి రవీందర్ రావు, దేశపతి శ్రీనివాస్, ఎల్. రమణ, యాదవ్ రెడ్డి, సుంకరి రాజు, నవీన్ కుమార్ రెడ్డి, తాతా మధుసూదన్, వాణీదేవి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డిలను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు.
సస్పెండైన సభ్యులు బయటకు వెళ్లాలని గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) ఆదేశించారు. మైనింగ్ అక్రమాలపై సభ సంఘం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) డిమాండ్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని(Minister Ponguleti Srinivas Reddy) బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సభ గౌరవాన్ని కాపాడాలని మండలి ఛైర్మన్ పదేపదే కోరారు. సభ సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) నేతలను కోరారు. బీఆర్ఎస్ సభ్యులు సభ నడవకుండా అడ్డుతగులుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరస నిరసనలు, నినాదాల దృష్ట్యా బీఆర్ఎస్ సభ్యులను ఛైర్మన్ సస్పెండ్ చేశారు.




