11 July, 2026 | 1:31 AM

ఎస్‌ఐఆర్ నమోదులో నిర్లక్ష్యం చేస్తే సస్పెన్షన్ తప్పదు

11-07-2026 12:32 AM

కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, జులై 10 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బీఎల్‌ఓలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో నమోదు కేవలం 14 శాతానికి, ఇతర మండలాల్లో సుమారు 50 శాతానికే పరిమితమవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

10 శాతం కంటే తక్కువ నమోదు చేసిన బీఎల్వోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పనితీరు మెరుగుపరచాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలు అందజేసి పూర్తి చేయించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బందితో పాటు ఆశా వర్కర్ల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఈ నెల 20లోపు నమోదు ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ సమీక్ష నేపథ్యంలో లక్ష్యం సాధించని సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.