ఏరోబిన్స్‌ను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్
మేడిపల్లి, జూలై 10 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ (శానిటేషన్) శ్రీ రఘు ప్రసాద్, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజతో కలిసి మై విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన ఏరోబిన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఏరోబిన్స్ ద్వారా తడి వ్యర్థాలను 45 నుండి 50 రోజుల వ్యవధిలో సేంద్రీయ ఎరువుగా (కంపోస్ట్) మార్చవచ్చని తెలిపారు.
ప్రతి ఏరోబిన్ సామర్థ్యం 400 లీటర్లు ఉండి, గృహాల నుంచి వెలువడే తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, స్వచ్ఛమైన పరిసరాల సాధనలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు గేటెడ్ కమ్యూనిటీలలో విస్తృతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. ఇట్టి కార్యక్రమములో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాహ్నవి శశాంక్, అసిస్టెంట్ ఇంజనీర్ మహేష్, మై విల్లాస్ నివాసితులు తదితరులు పాల్గొన్నారు.






