14 July, 2026 | 3:57 AM

సాయంత్రం సస్పెండ్, ఉదయం ఇంచార్జి హెచ్‌ఎం బాధ్యతలు?

14-07-2026 12:26 AM
  1. విద్యా శాఖలో అక్రమార్కులకే అందలం 
  2. డబ్బులు ఇస్తే ఏదైనా సాధ్యమే 
  3. విద్యాశాఖ అధికారుల పని తీరుపై ఉపాధ్యాయుల అసహనం 

సిద్దిపేట, జులై 13 (విజయక్రాంతి):సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరుపై జిల్లా వ్యాప్తంగా అవినీతి ఆరోపణల చర్చ జరుగుతుంది. ధన, వర్గ, రాజకీయ బలం ఉంటే ఏ తప్పు చేసిన చెల్లుతుందనే విధంగా ఉపాధ్యాయులలో బలం చేకూరుతుందని జిల్లా అధికారుల పనితీరు స్పష్టం చేస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. సాయం త్రం సస్పెండ్ చేసి, తెల్లారి ఉదయమే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడం విద్యాశాఖ జిల్లా అధికారులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలకు దారితీస్తున్నాయి. 

అసలేం జరిగింది..

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు నకిలీ ధ్రువీకరణ పత్రా లు సమర్పించి ఎర్నింగ్ లీవ్స్ మంజూరు చేసుకుంది. అందుకు అప్పటి ప్రధానోపాధ్యాయుడు బైరయ్య కొంత డబ్బులు తీసుకొని ఆమెకు ఎర్నింగ్ లీవ్స్ మంజూరు ఇచ్చినట్లు అధికారుల విచారణలో తేలింది.

అయితే 2018లో ఉపాధ్యాయురాలు వేసవికాలంలో శిక్షణ తరగతులలో విధులు నిర్వహించినట్లు అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి, చేర్యాల మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల స్పెషల్ అధికారుల (అప్పటి డిసిఈబి అసిస్టెంట్ సెక్రటరీ, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్నా ఉపాధ్యాయుని సహకారంతో) సంతకాలు ఫోర్జరీ చేసి ఎర్నింగ్ లీవ్స్ ను ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు.

కానీ ఆ ఉపాధ్యాయురాలు ఎర్నింగ్ లీవ్స్ మంజూరు చేసుకున్న తేదీల్లో కొండపాక జిల్లా పరిషత్ పాఠశాలలోనే విధులు నిర్వహిస్తుంది. ఇది మరో పెద్ద తప్పు కాగా ఈ విషయంపై అప్పట్లోనే కొంత మంది ఉపాధ్యాయులు రాతపూర్వకంగా ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జిల్లాలో విచారణ జరిపిన అధికారులకు నగ్నసత్యాలు వెలుగు చూశాయి 2019లో వేసవి శిబిరాలు జరగగా 2018లో ఆ ఉపాధ్యాయురాలు వేసవి శిక్షణ శిబిరాల్లో పనిచేసి నట్లు ఎర్నింగ్ లీవ్స్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి మర్పడగ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ముడుపులు చెల్లించి నమోదు చేయించుకున్నట్లు విచారణలో తేలింది.

విషయం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దాంతో ఆ ఉపాధ్యాయురాలు విద్యాశాఖ జిల్లా అధికారి సాయంత్రం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే పాఠశాల ప్రధానోపాధ్యాయులు బైరయ్య కు ఆర్టికల్ చార్జిమెమో ఇచ్చారు. అయితే జూన్ 30 నాడు ఆ ప్రధానోపాధ్యాయుడు పదవి విరమణ పొందారు ఆ పాఠశాల లోని అక్రమార్గాన ప్రభుత్వ సొమ్ము కాజేసి సస్పెండ్ అయిన ఉపాధ్యాయురాలికి జులై 1 నాడు ప్రధానోపాధ్యా యురాలుగా ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. సస్పెండ్ అయిన ఉపాధ్యాయురాలికి ప్రమోషన్ ఇవ్వడం ఎలా సాధ్యమైంది అంటూ ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. 

అవినీతి పరులెవరు...?

2018లో ఎలాంటి శిక్షణ తరగతులు నిర్వహించకుండానే తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించిన ఉపాధ్యాయురాలీ వద్ద కొంత మొత్తం తీసుకుని ఎర్నింగ్ లీవ్స్ మంజూరు చేసిన ప్రధానోపాధ్యాయుడిదా, విచారణలో వాస్తవం వెలుగు చూశాక సాయంత్రం సస్పెండ్ చేసి రాజకీయ పైరవీలకు తలగి ఉపాధ్యాయురాలి సస్పెండ్ ను రద్దు చేసిన జిల్లా అధికారులా..? తప్పు చేసినా ఉపాధ్యాయురాలని నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించాల్సిన రాజకీయ నాయకులు ఆ ఉపాధ్యాయురాలి సస్పెండ్ను రద్దుకు సిఫారసు చేసిన ఎమ్మెల్సీ, ఇందులో ఎవరు అవినీతి పరులో తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తానికి సిద్దిపేట జిల్లా విద్యాశాఖలో ఎంత పెద్ద తప్పు చేసిన శిక్షలు ఉండవని అవసరమైతే అవకాశం ఉంటే పదోన్నతులే ఉంటాయనేది తేటతెల్లమైందని అందుకు కొండపాక మండలం మర్పడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనని నిదర్శనమని తెలుస్తుంది. ఆ ఉపాధ్యాయురాలికి మెమో జారీ జారీ చేసినప్పటికీ ఆమె ఎలాంటి సంజయ్సీ ఇవ్వకపోవడం కొసమెరుపుగా మిగిలింది.

కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం

నేను ఇటీవలే శాఖ ఇంచా ర్జి తీసుకున్నాను. మర్పడగ పాఠశాల లో ఉపా ధ్యాయురాలి పై వచ్చిన పిర్యాదు పైల్ పరిశీలిస్తున్నాను. విషయాన్ని త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాము. నాకు ఆ ఉపాధ్యాయురాలు చేసిన తప్పిదాలపై పూర్తి సమాచారం లేదు ఆమె ఫైల్ పరిశీలిస్తున్నాం.

రమేశ్, జిల్లా విద్యాశాఖ అధికారి (ఇంచార్జి)