13 August, 2026 | 7:47 AM

ఎన్టీఆర్‌కు సర్జరీ విజయవంతం

13-08-2026 12:21 AM

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైంది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు బుధవారం ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ‘డ్రాగన్’ సినిమా కోసం సిద్ధమవుతున్న క్రమంలో ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైంది. మొదట విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని భావించినప్పటికీ.. వేగంగా, సంపూర్ణంగా కోలుకోవడానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరమని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది.

ఆ తర్వాత ఆసుపత్రి యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఎన్టీఆర్ సాధారణ స్థితికి రావడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు, ఎన్టీఆర్ స్వయంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “శస్త్రచికిత్స విజయవంతమైంది, నేను బాగున్నా. స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల మద్దతు నాకు బలాన్నిస్తుంది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా” అంటూ ట్వీట్ చేశారు.