శతకాభిషేకం
సన్‌రైజర్స్ హ్యాట్రిక్ విక్టరీ
అభిషేక్ శర్మ సెంచరీ
బౌలింగ్‌లో మలింగ అదుర్స్
ఉప్పల్ స్టేడియం హోరెత్తింది... సన్ రైజర్స్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ వచ్చేసింది. అది కూడా హాఫ్ సెంచరీ కాదు ఏకంగా సెంచరీతో దుమ్మురేపేశాడు. ఫలితంగా భారీస్కోరు చేసిన సన్ రైజర్స్ బౌలింగ్‌లోనూ రాణించి ఢిల్లీని చిత్తు చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 21: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ స్టేడియం అంటేనే పరుగుల వరద. దీంతో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ రెచ్చిపోయారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ పెద్ద ఇన్నింగ్స్ ఆడని అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. బంతి పడడమే ఆలస్యం ఎడాపెడా బాదేశాడు. నితీష్ రాణా వేసిన 15వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాది 47 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఐపీఎల్ లో అతనికి రెండో శతకం. సెంచరీ టీ20 క్రికెట్‌లో అత్యధిక శతకాలు చేసిన భారత క్రికెటర్‌గా కోహ్లీతో సమంగా నిలిచాడు.
ఓవరాల్ గా టీ20 కెరీర్‌లో అభిషేక్‌కు ఇది 9వ సెంచరీ. అటు హెడ్ (37), ఇషాన్ కిషన్ (25), క్లాసెన్ 37 నాటౌట్ కూడా రాణించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగానే ఆడింది. నిస్సాంక (8) త్వరగానే ఔటైనా కేఎల్ రాహుల్, నితీశ్ రాణా మెరుపులు మెరిపించారు.
వీరిద్దరూ రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. కెఎల్ రాహుల్ 37 (1 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. ఎహసాన్ మలింగ ఒకే ఓవర్లో నితీశ్ రాణా 30 బంతుల్లో 57 ( 7 ఫోర్లు, 3 సిక్సర్లు), మిల్లర్(0) ఔట్ చేశాడు. తర్వాత స్టబ్స్, రిజ్వీ దూకుడుగా ఆడుతూ 59 పరుగులు జోడించినా సన్ రైజర్స్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ 195 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ బౌలర్లలో మలింగ 4 , హర్ష దూబే 3 వికెట్లు తీశారు.
స్కోరు బోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 242/2 ( అభిషేక్ శర్మ 135, హెడ్ 37 , క్లాసెన్ 37, ఇషాన్ కిషన్ 25 ; అక్షర్ పటేల్ 1/23 )
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 195/9 ( నితీశ్ రాణా 57, సమీర్ రిజ్వీ 41, కెఎల్ రాహుల్ 37; మలింగ 4/32, హర్ష దూబే 3/12 )






