22 April, 2026 | 2:34 AM

లక్నోకు చావో రేవో

22-04-2026 01:28 AM

రాజస్థాన్‌తో కీలక మ్యాచ్

తీవ్ర ఒత్తిడిలో పంత్, పూరన్

లక్నో, ఏప్రిల్ 21: ఐపీఎల్ 19వ సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ డూ ఆర్ డై మ్యాచ్‌కు సిద్ధమైంది. తమ హోంగ్రౌండ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది. ప్లే ఆఫ్ రేసులో మరింత వెనుకబడకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి జరిగే ప్రతీ మ్యాచ్ ఆ జట్టుకు కీలకమే. ప్రస్తుతం లక్నో 6 మ్యాచ్‌లకు రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్, కోల్‌కతా జట్లపై గెలిచిన తర్వాత లక్నో వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది.

బ్యాటింగ్‌లో అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించడం లేదు. పంత్‌తో పాటు నికోలస్ పూరన్ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు కూడా లక్నో పేలవ ప్రదర్శనకు కారణంగా చెబుతున్నారు. గత మూడు మ్యాచ్‌లలో బ్యాటింగ్ వైఫల్యమే లక్నో ఓటములకు కారణమైంది. అటు బౌలింగ్‌లో మహ్మద్ షమీ పర్వాలేద నిపిస్తున్నా మిగిలిన బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.

బౌలర్లు కూడా పూర్తిస్థాయిలో గాడిన పడితే తప్ప లక్నో గెలుపు బాట పట్టే అవకాశం లేదు.మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా వరుసగా రెండు ఓటములతో డీలా పడింది. ఆరంభంలో అదరగొట్టిన రాజస్థాన్ గత రెండు మ్యాచ్‌లలో సన్ రైజర్స్, కోల్‌కతా జట్ల చేతిలో పరాజయం పాలైంది. ఆ జట్టు బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ మెరుపు ఆరంభాలనిస్తున్నా తర్వాతి బ్యాటర్లు దానిని కొనసాగించలేకపోతున్నారు. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న లక్నో పిచ్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. పైగా బౌండరీలు పెద్దవిగా ఉండడంతో 140-160 మధ్య స్కోర్లు నమోదవుతున్నాయి.