పొద్దుతిరుగుడు, మొక్కజొన్న దిగుడులను వెంటనే కొనుగోలు చేయాలి
గజ్వేల్ మార్కెట్ యార్డులో పొద్దు తిరుగుడు, మొక్కజొన్న పరిశీలించిన బీఆర్‌ఎస్ నాయకులు
గజ్వేల్, ఏప్రిల్ 24: రైతులు తీసుకువచ్చిన పొద్దుతిరుగుడు (సన్ఫ్లవర్), మొక్కజొన్న పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డును బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించి, రైతులు తీసుకువచ్చిన పంటలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా రైతులు తమ పంటలను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి నెల రోజులైనా కొనుగోలు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డుల్లో పంటలు నిల్వగా ఉండిపోవడంతో రైతులు దళారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఒక్క క్వింటాల్కు రూ.1000 నుంచి రూ.2000 వరకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల వల్ల నీటి లభ్యత పెరిగి రైతులు విస్తృతంగా పంటలు పండిస్తున్నారని పేర్కొన్నారు.
అయినప్పటికీ సరైన కొనుగోలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరలతో పంటలను కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి మార్కెట్ యార్డు ముందు, అనంతరం రాజీవ్ రహదారిపై భారీగా ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నర్సింగారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మండల అధ్యక్షుడు బెండ మధు తదితరులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.






