22 July, 2026 | 1:49 AM

లక్షలు వడ్డీకి తెచ్చి కట్టా.. నా పొట్ట కొట్టొద్దు!

22-07-2026 12:00 AM

పోలీస్‌స్టేషన్ ముందే కన్నీళ్లు పెట్టుకున్న బిల్డర్

రాజేంద్రనగర్, జూలై 21 (విజయక్రాంతి): సివిల్ వివాదాల్లో పోలీసులు ఎట్టికేలకు తలదూర్చవద్దు.. ఎలాంటి సమస్యలున్నా కోర్టుల్లోనే తేల్చుకోవాలని బాధితులకు సూచించాలి‘ అని పోలీస్ బాస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో మాత్రం ఆ నిబంధనలు అమలు కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు వివాదం ఏంటంటే..?

కిస్మత్పూర్ పరిధిలోని 150 గజాల స్థలంలో జి+1  భవనాన్ని రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించేందుకు ఓ భవన యజమాని, బిల్డర్ ఆంజనేయులు మధ్య ఒప్పందం కుదిరింది. నిర్మాణం దాదాపు పూర్తయ్యే సమయంలో, యజమాని అభ్యర్థన మేరకు మరో అంతస్తు (2వ అంతస్తు) కట్టేందుకు ఇరువైపులా అంగీకారం కుదిరింది.

దీనికోసం అదనంగా మరొక రూ. 20 లక్షలు చెల్లించేలా మాట్లాడుకుని, బిల్డర్ ఆంజనేయులు స్లాబ్ పనులు కూడా పూర్తి చేశాడు. పనులు పూర్తయ్యాక అదనపు అంతస్తుకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని బిల్డర్ పదేపదే కోరగా, యజమాని డబ్బులు ఇవ్వకుండా వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా, మంగళవారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో బిల్డ్పనే ఫిర్యాదు చేశాడు.

పోలీస్ స్టేషన్లో ఒత్తిళ్లు.. బాధితుడి ఆవేదన..!

యజమాని ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు బిల్డర్ ఆంజనేయులుకు ఫోన్ చేసి స్టేషన్కు పిలిపించారు.మధ్యాహ్నం వేళ రిసెప్షన్లో ఉన్న ఒక పోలీస్ సిబ్బంది బిల్డ్ప తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.భవనం దగ్గర ఉన్న నీ సామాను అంతా వెంటనే సర్దుకుని అక్కడి నుండి వెళ్లిపోవాలి‘ అని సదరు పోలీస్ తనను బెదిరించినట్లు బిల్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

లక్షల రూపాయలు వడ్డీలకు తెచ్చి భవనాన్ని నిర్మించాను. ఇప్పుడు నాకు రావాల్సిన డబ్బులు ఇప్పించకుండా, సామాన్లు పట్టుకుని పొమ్మంటే ఎలా? నాకు తీవ్ర అన్యాయం జరుగుతోంది, కాపాడండి‘ అని బాధితుడు ఆంజనేయులు పోలీసులను వేడుకుంటున్నాడు.

ఏం జరిగిందో సమగ్రంగా విచారిస్తాం..

ఈ వ్యవహారంపై రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్  ముత్తు యాదవ్ స్పందిస్తూ.. భవన యజమాని, బిల్డర్ మధ్య జరిగిన అసలు వివాదం ఏంటో పూర్తిస్థాయిలో తెలుసుకుంటామన్నారు. పోలీస్ స్టేషన్లో సివిల్ సెటిల్మెంట్ జరుగుతోందన్న ఆరోపణలపై తమ సిబ్బందిపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎవరూ కూడా ఎలాంటి సివిల్ వివాదాల్లోనూ జోక్యం చేసుకోవద్దని, నిబంధనలు దాటితే ఉపేక్షించేది లేదని ఆయన పునరుద్ఘాటించారు.

 ముత్తు యాదవ్, 

ఎస్‌హెచ్‌ఓ, రాజేంద్రనగర్