మంథనిలో మంత్రి శ్రీధర్‌బాబు బిజీబిజీ
- బాధిత కుటుంబాలకు పరామర్శలు
- అభివృద్ధి పనుల పర్యవేక్షణ
- రెండు రోజులపాటు పర్యటన
మంథని, జూలై 21 (విజయక్రాంతి): ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గడిచిన రెండు రోజులుగా తన సొంత నియోజకవర్గమైన మంథనిలో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపారు. ఒకవైపు బాధిత కుటుంబాలను పరామర్శించి కొండంత ధైర్యాన్ని ఇస్తూనే, మరోవైపు మంథని పట్టణ సమగ్ర అభివృద్ధి పనులు, రాబోయే గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సోమవారం ముత్తారం మండలంలో పర్యటించారు. కేశనపల్లి గ్రామంలో మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం తండ్రి లింగయ్య నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మంగళవారం ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి సువర్ణ వనమాల అంత్యక్రియలకు హాజరయ్యారు.
శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంథని పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి మంత్రి సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల పురోగతిపై శ్రీధర్ బాబు నిరంతర అధికారులతో పర్యవేక్షణ కొనసాగించారు.
మంథని గోదావరి తీరాన్ని సందర్శించిన మంత్రి, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మంథని పట్టణంలో పాత పెట్రోల్ బంక్ నుంచి బస్ డిపో వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 100 అడుగుల ప్రధాన రహదారి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.






