07-02-2026 12:00:00 AM
31మంది మృతి.. 169 మందికి గాయాలు
ఇస్లామాబాద్‌లోని ప్రార్థనా మందిరంలో దారుణం
ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 6 : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ప్రార్థనల సమయంలో తర్లాయ్ కలాన్ ప్రాంతంలోని ఖదీజా తుల్ కుబ్రా మసీదులో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ఆత్మా హుతి దాడిలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 169 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. క్షతగాత్రులను పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్) ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
చెల్లాచెదురుగా శరీర భాగాలు
మసీదు ప్రధాన ద్వారం వద్ద ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గేటు వద్ద భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోవడంతో నిందితుడు పేలుడుకు పాల్పడ్డాడు. ఘటనా స్థలం లో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. భయానక దృశ్యాలతో మసీదు ప్రాంగణం నిండిపోయింది. పేలుడు ధాటికి కిటికీల అద్దాలు పగిలిపోయాయి. మసీదు లోపల రక్తపు మడుగులో ఉన్న బాధితులను చూసి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నా రు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.
పిరికిపంద చర్య
ఈ దాడిని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. అమాయక భక్తులపై జరిగిన ఈ పిరికిపంద చర్యపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఆరాధనా స్థలాలను లక్ష్యంగా చేసుకోవడం మానవత్వానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ అధికారిక పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ ఘోరం జరగడం గమనార్హం. గత నవంబర్‌లో కూడా ఇస్లామాబాద్ కోర్టు ప్రాం గణంలో ఆత్మాహుతి దాడి జరిగి 12 మంది మరణించారు.
మృతుల కుటుంబాలకు సంతాపం
బ్రిటన్ రాయబారి జేన్ మారియట్ ఈ హింసను అసహ్యకరమై నదిగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు యూరోపి యన్ యూనియన్ ప్రతినిధులు సంతాపం తెలిపారు. భద్రతా దళాలు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయి. దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన విడుదల చేయలేదు. గత కొద్ది రోజులుగా పా కిస్థాన్ దళాలకు, బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి మధ్య ఘర్షణలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని నగరంలో పేలుడు సంభ వించ డం ఆందోళన కలిగిస్తోంది.