హేమాచల క్షేత్రంలో సుదర్శన హోమం
మంగపేట,(విజయక్రాంతి) : రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని శ్రీ హేమాచల (మల్లూరు) లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం సుదర్శన హోమం, సాయంత్రం ఎదుర్కోల్లు కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు, శ్రీ హేమాచల ( మల్లూరు ) లక్ష్మీ నృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులు, వారి బృందం, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ముక్కామల రాజశేఖర శర్మ, అర్చకులు కారంపూడి పవనకుమారాచార్యులు, యేడునూతల ఈశ్వర చందు శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ ( బాబీ ), అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ తదితరుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి స్నపనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చతుస్థానార్చన , సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వాహణాధికారి ఎం.వీరాస్వామి, ఉత్సవ కమిటీ చైర్మన్ యర్రంగారి సురేష్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.






