విద్యార్థులు పరీక్షల భయం వీడాలి
డాక్టర్ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
రాజన్న సిరిసిల్ల,ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): హెల్పింగ్ హారట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బద్దెనపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ అందించారు.
ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలను భయంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి. సరైన ప్రణాళిక, సమయపాలన మరియు సానుకూల దృక్పథం ఉంటే పరీక్షలలో విజయం సాధించవచ్చు అని తెలిపారు. పరీక్షల ముందు కలిగే ఆందోళన, భయం, నిద్రలేమి వంటి లక్షణాలను ఎలా నియంత్రించుకోవాలో ఆయన వివరించారు. విద్యార్థులకు మైండ్ మ్యాపింగ్ పద్ధతి గురించి సమగ్రంగా వివరిస్తూ, ఒక అంశాన్ని చిత్ర రూపంలో విభజించి చదివితే సులభంగా గుర్తుంచుకోవచ్చని తెలిపారు.
ముఖ్యాంశాలను శాఖల రూపంలో రాసుకుంటే మెమొరీ శక్తి పెరుగుతుందని అన్నారు. అదేవిధంగా మెమొరీ టెక్నిక్స్ గురించి వివరించి,అసోసియేషన్ పద్ధతి,విజువలైజేషన్ టెక్నిక్,రిపిటిషన్ పద్ధతి,కీవర్డ్ టెక్నిక్స్ వంటి విధానాలను ఉపయోగించడం ద్వారా చదివిన విషయాలను ఎక్కువకాలం గుర్తుంచుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హారట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువల ఈశ్వర్, మండల విద్యాధికారి భూక్యా రాజు నాయక్, ఉపాధ్యాయులు శంకర్, తిరుపతిరెడ్డి, రంజీ నాయక్, విక్రమ్, రమణ విద్యార్థులు పాల్గొని ఆసక్తిగా సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.




