24 July, 2026 | 4:08 AM

విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యత వహిస్తూ... ప్రధాని రాజీనామా చేయాలి

24-07-2026 12:38 AM

వంటేరు ప్రతాప్ రెడ్డి, చలో ఇందిరాపార్క్ కు పిలుపు

గజ్వేల్, జూలై 23: ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తూ, దానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించనున్న ‘చలో ఇందిరాపార్క్’ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారన్నారు. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రజల అసలు సమస్యలను పక్కనపెట్టి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు వంటి సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో విఫలమైందని విమర్శించారు.

దేశంలో నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల వంటి సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ పీఏసీఎస్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పంగా మల్లేశం, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు అత్తిలి శ్రీనివాస్, బొగ్గుల స్వప్న సురేష్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.