16 May, 2026 | 4:31 AM

పశువుల అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలి

16-05-2026 01:12 AM

అదనపు కలెక్టర్ కిరణ్మయి

రంగారెడ్డి, మే 15(విజయక్రాంతి): బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు అధికారులు గట్టి నిఘా ఉంచాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జంతు సంక్షేమం, గోవధ నిషేధ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో గోవధతో పాటు ఒంటెల వధపై కూడా నిషేధం అమలులో ఉందని, ఈ విషయాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి పశువులను తరలిస్తే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

రెవెన్యూ, పోలీస్, రవాణా, మున్సిపల్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ.. జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో పండుగ జరిగేలా చూడాలని ఆదేశించారు. పండుగ వ్యర్థాలను జనావాసాలకు దూరంగా తరలించాలని మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు జగదీశ్వర్ రెడ్డి, అనంత్ రెడ్డి, సరిత తదితర అధికారులు పాల్గొన్నారు.